Hyderabad

News July 4, 2024

HYD: ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు జాబ్‌మేళా

image

రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉపాధి శాఖ కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్తంగా ఈనెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. HYD ఎర్రగడ్డ రైతుబజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు. దాదాపు 17 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఫోన్: 9494092219

News July 4, 2024

సికింద్రాబాద్: B.Tech పూర్తి చేసిన ఆర్మీ అధికారులు

image

సికింద్రాబాద్ MCEME వద్ద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా TES-41, B.Tech కోర్సు పూర్తి చేసిన ఆర్మీ అధికారులకు పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీలంక, భూటాన్ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అధికారులు సైతం ఉన్నట్లు డాక్టర్ రమేశ్ కంచర్ల తెలియజేశారు. ఉద్యోగంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని అధికారులన్నారు.

News July 4, 2024

HYD: కంటోన్మెంట్ విలీనంపై స్పష్టత ఇవ్వండి: ఈటల

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు, ఉద్యోగులకు సబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

News July 4, 2024

HYD: నిలోఫర్ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

నిలోఫర్ ఆసుపత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్ బ్లాక్, డయాగ్నొస్టిక్ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్ సర్జికల్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు, ఎస్ఎన్సీయూ లాక్టేషన్ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ పరిశీలించారు.

News July 4, 2024

HYD: 40 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం

image

HYD నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 40 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్‌లకు అటాచ్ చేస్తూ ఆదేశించారు.

News July 4, 2024

HYD: బాలుడిని కొట్టిన వ్యక్తికి రిమాండ్: సీఐ

image

HYD శివారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాలు.. పది రోజుల క్రితం షాబాద్ మండలం కేసారం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న దళిత విద్యార్థి బేగరి యాదగిరిపై అదే గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి దాడి చేశాడు. బహిరంగంగా తాడుతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఈఘటనలో బుధవారం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కాంతారెడ్డి తెలిపారు.

News July 4, 2024

HYD: సమన్వయంతో పనిచేద్దాం: ఈవీడీఎం కమిషనర్

image

వర్షాకాలంలో ఈవీడీఎం విభాగం, పోలీసులు సమన్వయంతో పనిచేసి నగరంలో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుందామని ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్‌తో పాటు ట్రై కమిషనరేట్ల (HYD, సైబరాబాద్, రాచకొండ) పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

News July 4, 2024

HYD: మంత్రివర్గంలో చోటుపై ఎమ్మెల్యేల లాబీయింగ్

image

ఉమ్మడి RR జిల్లాలోని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. కాగా ఇప్పటికే తమ నేత మంత్రి అవనున్నారని, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో ఎవరు మంత్రి అవతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

News July 4, 2024

HYD: గురుకులాల్లో కామన్ టైమ్ టేబుల్: సీఎస్

image

రాష్ట్రంలోని ఐదు గురుకుల విద్యా సంస్థల్లో కామన్ టైమ్ టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా బోధన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలో అయితే డేస్కాలర్ స్కూల్ తరహాలో టైమ్ టేబుల్ అమలు చేస్తున్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే విధానం అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి బుధవారం HYDలో ఉత్తర్వులు జారీ చేశారు.

News July 4, 2024

నేడు GHMC స్థాయీ సంఘం సమావేశం

image

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన నేడు స్థాయీ సంఘం సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 11 అంశాలకు సంబంధించి.. అన్ని పార్టీల సభ్యులు చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపనున్నారు. GHMCలోని వివిధ శాఖల అధికారులు, సభ్యులు ఈ భేటీకి హాజరవుతారు.