Hyderabad

News April 8, 2024

HYD: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా చికెన్ ధర ప్రస్తుతం రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. మరో వారంలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు.

News April 8, 2024

HYD: రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం: రోనాల్డ్ రాస్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.1,73,60,502 విలువ జేసే ఇతర వస్తువులు, 19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 8, 2024

HYD: లింక్ ఓపెన్ చేశాడు.. రూ.16 లక్షలు స్వాహా

image

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌ బుక్‌లో యాడ్ చూసి, అందులో ఉన్న లింక్ ఓపెన్ చేశాడు. విడతల వారీగా రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించి HYD సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వాటికి అడిక్ట్‌ కావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

News April 8, 2024

HYD: మూతలేని నీటి సంపులో పడి చిన్నారి మృతి

image

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు మూతలేని నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన HYD జీడిమెట్ల PS పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘాపూర్‌‌ వాసి శివకుమార్ షాపూర్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం భార్యాభర్తలు భోజనం చేసి నిద్రపోయారు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి ముందున్న సంపులో పడిపోయింది. కొద్దిసేపటికే అత్త నీటి కోసం వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది. కేసు నమోదైంది.

News April 8, 2024

HYD: భానుడి ఉగ్రరూపం.. బయటకు రాకండి..!

image

HYD, ఉమ్మడి RRలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గమనార్హం. ఉ.8 నుంచి మొదలు సా.5 వరకు వేడి గాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మేడ్చల్‌లో 42.6, మూసాపేట 41.9, మల్కాజిగిరి 41.5, అంబర్‌పేట్ 41.4, ఉప్పల్ 41.3, ముషీరాబాద్ 41.2, చార్మినార్ 41.1, మెహదీపట్నం 41.0, ఇబ్రహీంపట్నం 41.6, వికారాబాద్‌ 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 8, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్యాలు

image

HYD మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఒడిసి, మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలు అలరించాయి. నిర్మల్య డాన్స్ స్కూల్ గురువు దేబస్రి పట్నాయక్ శిష్య బృందం ఒడిసి నృత్య ప్రదర్శనలో బట్టు నృత్య, పల్లవి, మోక్ష, మొదలైన అంశాలను, డా.మైథిలి అనూప్ శిష్య బృందం మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలో శ్లోకాలు, నవరసాంజలి, జతిస్వరం, కీర్తనం, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

News April 8, 2024

HYD: మాదిగలను విస్మరించిన కాంగ్రెస్: మంద కృష్ణ మాదిగ

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ కేటాయింపుల్లో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే రెండు స్థానాల్లో మాదిగలకు టికెట్లు కేటాయించిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

News April 8, 2024

HYD: పోలీసులకు హీరో విజయ్ దేవరకొండ మేనేజర్ ఫిర్యాదు

image

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మేనేజర్ అనురాగ్ పర్వతనేని, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి HYD మాదాపూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పనిగట్టుకొని ఫ్యామిలీ స్టార్ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మేనేజర్ తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

News April 8, 2024

HYD: ప్రారంభానికి నోచుకోని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం

image

రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు వాయిదా పడగా.. ప్రస్తుత ప్రభుత్వమైన TSFTIని ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

News April 8, 2024

HYD: మోసం చేసే పార్టీ కాంగ్రెస్: రాణి రుద్రమ దేవి 

image

అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని, వంద రోజుల్లో 6 గ్యారంటీలను బొంద పెట్టారని మండిపడ్డారు.

error: Content is protected !!