Karimnagar

News May 7, 2024

రేపు ఉదయం 8 గంటలకు మోదీ సభ: బండి

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు వేములవాడ పట్టణంలోని జగిత్యాల బైపాస్ రోడ్డులో కోర్టు పక్కన గల మైదానంలో సభ కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News May 7, 2024

కరీంనగర్: 18-39 ఏళ్ల వారే కీలకం!

image

కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి యువ ఓటర్ల పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 29 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 45% పైగా 18-39 ఏళ్లు ఉన్న వారే కావడంతో తమకు అనుకూలంగా మళ్లించుకునే దిశగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

News May 7, 2024

వేములవాడకు మోదీ రాక.. ఆలయంలో భద్రతా చర్యలు

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి బుధవారం ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మంగళవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రక్షణ చర్యల్లో భాగంగా రెండు గంటల పాటు భక్తులను పోలీసులు దర్శనానికి అనుమతించలేదు. అనంతరం భక్తులు యధావిధిగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి పోలీస్ సిబ్బంది మోదీ రక్షణ చర్యల నిమిత్తం ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

News May 7, 2024

బీఫార్మసీ, బీపీఈడీ ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఫార్మసీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలు విడదలయ్యాయని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ 1,2,7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు, బీపీఈడీ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలు వెబ్‌సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 7, 2024

కరీంనగర్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

ఆన్లైన్ గేమ్‌లతో డబ్బులు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన లక్ష్మణ్- లక్ష్మి కుమారుడు పృథ్వీ (25) నోయిడా(UP)లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడు స్నేహితుల వద్ద రూ.12 లక్షల అప్పు చేసి ఆన్లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. ఆ అప్పు ఎలా తీర్చాలనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

image

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

News May 7, 2024

కరీంనగర్ తీగల వంతెనపై నుంచి దూకి వ్యక్తి సూసైడ్

image

కరీంనగర్ తీగల వంతెనపై నుంచి కిందికి దూకి గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిస్తే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

News May 7, 2024

కరీంనగర్: నేడు రాహుల్.. రేపు మోదీ.. ఎల్లుండి కేసీఆర్

image

లోక్‌సభ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరీంనగర్‌లో పర్యటించనున్నారు. బుధవారం ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున వేములవాడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. గురువారం BRS అధినేత కేసీఆర్ కరీంనగర్‌లో పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ తరఫున ప్రచారంలో పాల్గొంటారు.

News May 7, 2024

వేములవాడకు రూ.500 కోట్లు ప్రకటించాలి: వినోద్ కుమార్

image

కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం రాత్రి వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వారణాసికి వందల కోట్లు కేటాయించారని అన్నారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు మాత్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. వేములవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

News May 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?

image

నేడు ఉమ్మడి KNR జిల్లాలో ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా రాయికల్ మం. అల్లీపూర్, వెల్గటూర్ మం. గుల్లకోటలో 46.8°C, బీర్పూర్ మం. కొల్వైలో 46.3°C, ఇబ్రహీంపట్నం మం. గోదురులో 46.1°C, ధర్మపురి మం. నేరెళ్లలో 45.8°C, ముత్తారంలో 46.4°C, సుల్తానాబాద్ మం. సుగ్లంపల్లిలో 46.3°C నమోదయ్యాయి. కమాన్‌పూర్‌లో 45.9°C, జమ్మికుంటలో 46.2°C, వీణవంకలో 45.8°C నమోదైనట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!