Khammam

News June 20, 2024

కేటీపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు కార్మికులకు గాయాలు

image

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీపీఎస్‌లోని డీడీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అందులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను యాజమాన్యం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.  ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News June 20, 2024

ఖమ్మం: రాష్ట్రానికి సింగరేణి జీవగడ్డ లాంటిది- తుమ్మల

image

రాష్ట్రానికి సింగరేణి జీవగడ్డ లాంటిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వేలం పేరుతో బొగ్గు గనులను ప్రవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని అన్నారు. బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని గనులన్నీ సింగరేణికే అప్పజెప్పాలన్నారు.

News June 20, 2024

మూడేళ్లలో రూ.2.76 లక్షల ఆదాయం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వం 481 సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. దీంతో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఆదాయం సృష్టించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. నిర్లక్ష్యం కారణంగా అనేక జీపీలలో చెత్త సేకరణ ద్వారా ఆశించిన ఆదాయం లేదు. కొన్ని జీపీలు మాత్రం చెత్త నుంచి మంచి రాబడి పొందుతూ ఔరా అనిపిస్తున్నాయి. ఇందులో అశ్వాపురం జీపీ మూడేళ్లల్లో రూ.2.76 లక్షల ఆదాయం సాధించి జిల్లాలోనే నెం.1గా ఉంది.

News June 20, 2024

ఖమ్మంలో రాజకీయ దుమారం రేపుతున్న జీవో 59

image

ఖమ్మంలో జీవో 59 వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను అధికారంలో ఉన్న సమయంలో ఆక్రమించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించినట్లు అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

News June 20, 2024

గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు

image

టీజీపీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జీ.శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్ 2కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 19 నుంచి జులై 5 వరకు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జులై 8, 9 , 15, 22, 30 తేదీల్లో టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News June 20, 2024

ఖమ్మం మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7050 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు తెలిపారు. మిర్చి ధరలు నిన్న, ఈ రోజు స్థిరంగా కొనసాగుతుండగా, అటు పత్తి ధర మాత్రం 75 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.

News June 20, 2024

ఉద్యాన రైతులకు రాయితీలు విడుదల

image

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు, బిందు సేద్యం పరికరాల రాయితీలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో 2,483 మంది రైతులు 10,561.80 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను వేశారు. అంతర సాగుకు ఎకరాకు రూ.2,150, నిర్వహణకు మరో రూ.2,150 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకరంగా అందిస్తోంది. అలాగే ఉద్యాన పంటల నీటి యాజమాన్యం కోసం ఉపయోగించే పరికరాలకు 2022-23 ఏడాదికి గాను 45.94 లక్షలు విడుదల చేసింది.

News June 20, 2024

పల్లె వైద్యుల మాయ.. 122 మంది గుర్తింపు!

image

అర్హత లేని వైద్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారు. డాక్టర్లుగా చలామణి అవుతూ స్టెరాయిడ్, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 22 ప్రాంతాల్లో తనిఖీలు చేయగా 122 మంది ఆర్ఎంపీ, పీఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.

News June 20, 2024

జిల్లాలో 875 మంది పదోన్నతులు.. విధుల్లో చేరిక

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావటంతో వారు ఆయా స్థానాల్లో విధుల్లో చేరారు. జిల్లాలోని పండిట్, పీఈటీ, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. జిల్లాలో 954 మందికి పదోన్నతులు రాగా.. 875 మంది బుధవారమే విధుల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా వారు నేడు విధుల్లో చేరే అవకాశం ఉంది.

News June 20, 2024

ఖమ్మం: ఈనెల 22న జేఎల్ఎంలకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ 

image

ఖమ్మంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఈనెల 22న ఉమ్మడి జిల్లాలోని జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన, పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.సురేందర్ తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.