Khammam

News February 10, 2025

ఖమ్మం: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

News February 10, 2025

ఖమ్మం: ‘దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు’

image

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం దివ్యాంగులు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.

News February 10, 2025

ఖమ్మం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే

image

ఖమ్మం జిల్లా కలెక్టర్‌లో ఈరోజు గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా అందులో పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై దరఖాస్తుదారులు తెలియజేయగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.  

News February 10, 2025

భద్రాచలం: తల్లితో గొడవపడి బాలిక ఆత్మహత్య

image

తల్లితో గొడవపడి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎంపీ కాలనీకి చెందిన 9వ తరగతి బాలిక(14) తన తల్లి విజయలక్ష్మితో కొన్ని రోజులుగా గొడవ పడుతోంది. తల్లితో గొడవను తట్టుకోలేక మనస్తాపం చెందిన ఆ బాలిక క్షణికావేశంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం తల్లి ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

News February 10, 2025

ముత్తంగి అలంకారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యాహవాచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్యకళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.

News February 10, 2025

బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్: తమ్మినేని

image

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉందని ఖమ్మం మాజీ ఎంపీ, సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణను విస్మరించిందని, రైతును, వ్యవసాయనికి మరచినదని అన్నారు.

News February 10, 2025

ఖమ్మం: కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

image

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.

News February 10, 2025

50 ఏళ్లుగా మోటారు లేకున్నా నీటి సదుపాయం

image

భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో వేసిన బోరులో భగీరథుడే ఉన్నట్లు నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఊరిలో నీళ్ల కరవుందని 50 ఏళ్ల కింద బోరు వేశారు.. మోటారు బిగిద్దామనుకుంటే నీళ్లు ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని అంటున్నారు. పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ నీళ్లనే వాడుకుంటున్నారు.

News February 10, 2025

చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..

image

సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.

News February 10, 2025

పులిగుండాల అందాలు చూడతరమా..!

image

ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతమైన పులిగుండాలను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, చెరువులో బోటింగ్, రాత్రిళ్లు నక్షత్రాల వ్యూ, క్యాంపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పర్యాటక పనులు త్వరగా పూర్తి చేస్తే జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.