India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో పంట పనులు వదులుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరాలో నిర్లక్ష్యం వీడి, తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఏడు పంచాయతీల విలీనంతో 20 వార్డులు, 18,868 మంది ఓటర్లతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించింది. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల కానుండటంతో అభ్యర్థుల వేట మొదలైంది. భవిష్యత్లో కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఇక్కడ పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ, సెలవుల వల్ల ఏర్పడిన ఖాళీల్లో 46 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్, డిసెంబర్ నెలల ఖాళీలతో పాటు సెక్టోరల్ విభాగాల్లోని ఏఎంవో, జీసీడీవో స్థానాల్లోనూ నియామకాలు చేపట్టారు.

ఖమ్మంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతకాని విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ పి. సందీప్ రెడ్డి మృతి చెందారు. విధి నిర్వహణ ముగించుకుని బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో, విద్యుత్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

1997లో మొదలైన సత్తుపల్లి జిల్లా ఉద్యమం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నాటి ఉద్యమ సారథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రాష్ట్ర మంత్రిగా ఉండటంతో జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. నాడు జిల్లా ఆవశ్యకతపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేగవంతం చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ ‘తీపి కబురు’ ఎప్పుడు వింటామా స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని ‘రోజులు’, ‘వారాల’ వడ్డీల పేరుతో రక్తాన్ని పీల్చుతున్నారు. అప్పుతీర్చడం ఆలస్యమైతే అధిక వడ్డీలు, వేధింపులతో బెంబేలెత్తిస్తుండటంతో సామాన్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు స్పందించి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేదలను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.

సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. నగలు బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు తాళం వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

పదేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. 2025-26కు గాను ఖమ్మం జిల్లాకు రూ.4.37 కోట్ల రాయితీ నిధులను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 50%, ఇతరులకు 40% రాయితీతో యంత్రాలు అందించనున్నారు. ఇప్పటికే 387 మంది రైతులు డీడీలు చెల్లించగా, తొలి విడతలో 172 యూనిట్లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు.

ఖమ్మం(D)లోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఈనెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల కానుండగా అనంతరం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఖరారుకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టనుంది. ఛైర్మన్ పదవులు, వార్డుల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సత్తుపల్లి, వైరా, మధిరతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10,552 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఎలాంటి కొరత లేదని గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా కోసం మార్క్ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు నిల్వలు చేరవేసే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 29,178 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.