Khammam

News November 11, 2025

ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

image

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

News November 11, 2025

ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన నూతన DEO

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి(డీఈఓ)గా నియమితులైన చైతన్య జైని, బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 11, 2025

సదరమ్ సర్టిఫికెట్ల మంజూరుకు రూ.2 కోట్ల వసూళ్లు?

image

జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విభాగంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకల్య శాతాన్ని పెంచేందుకు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20-40 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నలుగురు ఉద్యోగులు బృందంగా ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగుల నుంచి వసూళ్లకు పాల్పడటమేంటని జిల్లా వాసులు మండిపడుతున్నారు.

News November 11, 2025

పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. రైతులు తేమశాతం 12 లోపు ఉంచి పత్తి విక్రయించాలన్నారు. పత్తి కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమీప జిన్నింగ్ మిల్లుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. కౌలు రైతులు కూడా యాప్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

News November 11, 2025

విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

image

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

News November 11, 2025

ఈవీఎం గోడౌన్‌ వద్ద భద్రత పటిష్టం చేయాలి: కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్‌ వద్ద పటిష్ట నిఘా ఉండాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. సీల్స్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, సైరన్ పనితీరును పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టులు, విధులను తెలుసుకొని, భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. తనిఖీలో రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, ఎన్నికల సూపరింటెండెంట్ రాజు పాల్గొన్నారు.

News November 11, 2025

ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

News November 11, 2025

అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం

image

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాయమైపోతున్న మనిషి విలువల గురించి చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతికి నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు. అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.

News November 11, 2025

ఖమ్మంలో కొత్త రేషన్ కార్డుల జోరు

image

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.

News November 11, 2025

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి: మంత్రులు

image

ఖమ్మం జిల్లాలోని ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్‌కు కేంద్రాలను ప్రారంభించాలని ధాన్యం త్వరగా తరలించాలని సూచించారు. తార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు సహా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.