Khammam

News March 27, 2024

భద్రాచల రామాలయ హుండీ లెక్కింపు పూర్తి

image

భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నేడు హుండీ లెక్కింపు జరిపారు. 26 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.71, 22, 878, అన్నదానం ఆదాయం 1,61,100, గోశాలకు రూ. 1,95,363 మొత్తం ఆదాయం రూ. 74,79,341 ఆదాయం లభించినట్లు ఈవో రమాదేవి తెలిపారు. యూఎస్ డాలర్స్ 270, కెనడా డాలర్స్ 50, మలేషియా 20, వియత్నం 2000 లభించినట్లు ప్రకటించారు. ఈ మొత్తం బ్యాంకు అధికారులకు జమ చేశామని ఏఈఓ భవాని, రామకృష్ణ, ఆలయఅధికారులన్నారు.

News March 27, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం వారాంతరపు సెలవులు సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం మార్కెట్ పునఃప్రారంభమై క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోనే రైతులు గమనించాలన్నారు.

News March 27, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచేది ఎవరు..?

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై నేడు ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు రాత్రి ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేసి ప్రకటన చేయనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని విక్రమార్క ఉన్నారు. వీరిలో ఒకరిని అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాగా వీరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారో కామెంట్ చేయండి.

News March 27, 2024

కొత్తగూడెం: బైక్ చోరీ.. చలనాతో బయటపడింది..

image

ములుగు జిల్లాలో ఇటీవల చోరీకి గురైన బైక్ మణుగూరులో ప్రత్యక్షమైంది. కాగా స్థానిక పోలీసులు ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించలేదని చలానా కొట్టడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

ఖమ్మం మట్టి వాసన తెలిసిన వ్యక్తి నేను: తాండ్ర 

image

ఖమ్మం మట్టి వాసన తెలిసిన వ్యక్తి తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం రూ. 12వేల కోట్ల (నేషనల్ హైవేలు, సంక్షేమ పథకాలు కలుపుకొని)ఖర్చుచేసినట్లు తెలిపారు. తాను గెలిస్తే మరింతగా జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. పలు సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి ఖమ్మం స్థానం కమలం కైవసం చేసుకుంటుందన్నారు.

News March 27, 2024

ప్రజలు వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: DHMO

image

ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున ఖమ్మం జిల్లాలోని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని , వ్యక్తికి వీలైనంత గాలి తగిలే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. సాధ్యమైనంతవరకు ఎండలో బయటకు వెళ్లడం ఆపివేయాలన్నారు.

News March 27, 2024

ఖమ్మం: ఉద్యోగ వేట.. గ్రంథాలయ బాట

image

ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ కొలువులు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే సాధించాలని కొందరు, ఈసారైనా కల నెరవేర్చుకోవాలని మరికొందరు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లో సాధన చేస్తున్నారు. అక్కడి వసతులను ఉపయోగించుకుని అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు.

News March 27, 2024

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురానికి చెందిన బాదావత్ రాందాస్ ఆర్టీసీలో బస్సులో ప్రయాణిస్తూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాందాస్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తన భార్యతో కలిసి చికిత్స నిమిత్తం బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో బస్సు చిట్యాల శివారులో రాందాస్‌కు గుండెనొప్పి వచ్చింది. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ప్రయాణికులు చెప్పారు.

News March 27, 2024

BJP అడ్డుకునేది కమ్యూనిస్టులే: ఎమ్మెల్యే కూనంనేని

image

దేశంలో మతోన్మాద పోకడలు అవలంబిస్తున్న బీజేపీని నిలువరించే శక్తి, సామర్థ్యం కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పాల్వంచ సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. దేశంలో మోదీని గద్దె దింపేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

News March 27, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,900 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.