Khammam

News June 19, 2024

మణుగూరు నుంచి దక్షిణ కొరియాకు భారజలం ఎగుమతి

image

దక్షిణ కొరియాకు 20 వేల లీటర్ల భారజలాన్ని భద్రాద్రి జిల్లాలోని మణుగూరు భారజల ప్లాంటు నుంచి ఎగుమతి చేశారు. గౌతమీనగర్ లోని పర్ణశాల అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారజలం ఉన్న కంటైనర్ వాహనాన్ని భారజల బోర్డు ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.సత్య కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సీఐఎస్‌ఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈ వాహనం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది.

News June 19, 2024

ఖమ్మం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ప్రకాశ్ నగర్‌కు చెందిన మాదాసు రవి ఖానాపురంలో ఓ ఇంట్లో పనికి వెళ్ళాడు. అక్కడ పని చేస్తుండగా విద్యుత్ తీగ తగలడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News June 19, 2024

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి బుధవారం జిల్లా కలెక్టర్ అబ్దుల్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు.

News June 19, 2024

‘కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతాం’

image

కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అప్పులు చేసి సంపద సృష్టిస్తామని ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతు రుణమాఫీకి పూర్తిగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.

News June 19, 2024

జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి పొంగులేటి

image

ఖమ్మంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని సీనియర్ జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. తదనంతరం మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అతి త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామన్నారు.

News June 19, 2024

సైబర్ నేరస్తుల నయాదందా.. స్వీట్ మనీ పేరిట నగదు డిపాజిట్..!

image

ఖమ్మంలో సైబర్ నేరస్థులు నయాదందాకు తెరలేపారు. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడి అకౌంట్లో గత వారం స్వీట్ మనీ యాప్ మోసగాళ్లు రూ.1,800 డిపాజిట్ చేశారు. వారం రోజుల తర్వాత సదరు యువకుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి రూ.1,800తో పాటు రూ.3వేలు తిరిగి పేమెంట్ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో బాధిత యువకుడు ఆ రూ.1800ను తిరిగి పేమెంట్ చేసి, సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 19, 2024

KMM: భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

image

రెండో భార్యను హత్యచేసిన కేసులో ఆర్ఎంపీని ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం దివ్యాంగుల కాలనీకి చెందిన మల్లయ్య తన రెండో భార్య కళావతిని సోమవారం తెల్లవారుజామున హత్య చేయడమే కాక సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా నిజం బయటపడడంతో మంగళవారం మల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

News June 19, 2024

రుణమాఫీకి రెడీ.. 5.58 లక్షల మంది రైతుల ఆశలు

image

రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2023 DEC 12 నాటికి ఉమ్మడి KMM జిల్లాలో 5.58 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,123 కోట్ల మేర పంట రుణాలను తీసుకున్నట్లు లీడ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎందరు మాఫీకి అర్హత సాధిస్తారనే అంశం ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ద్వారా తేలనుంది. AUG 15 నాటికి అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

News June 19, 2024

ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ సర్వే వివరాలు

image

ఖమ్మం జిల్లాలో 2,46,683 ఇళ్లు ఉండగా వాటిని సర్వే చేస్తుంటే కొత్త గృహాలు లెక్కలోకి వస్తున్నాయి. కొత్త ఇళ్లను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. సోమవారం వరకు జిల్లాలో 64,621 పాత ఇళ్లను సర్వే చేయగా మరో 78,302 కొత్త ఇళ్లు గుర్తించి వాటి వివరాలు పొందుపరిచారు. వాస్తవ లెక్కల ప్రకారం ఇంకా 1,82,062 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా కొత్త గృహాలను ఇంకెన్ని గుర్తిస్తారో తేలాల్సి ఉంది.

News June 19, 2024

జిల్లాలో మిషన్ భగీరథ సర్వే వివరాలు

image

భద్రాద్రి జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,516 ఆవాసాల్లో 2,70,000 గృహాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. క్షేత్రస్థాయిలో సర్వేలో భాగంగా మంగళవారం వరకు 1,60,604 నివాసాల వివరాలు పొందుపరిచారు. పంచాయతీల్లో ఆన్లైన్లో ఇంటి నంబర్, పన్ను తదితర వివరాలతో నమోదైన ఇళ్లు 36,541 మాత్రమే. ఆన్లైన్లో నమోదుకాని పెండింగ్లోని నివాసాలు 1,82,615, కొత్త గృహాలు 1,24,063 ఉండటం గమనార్హం.