Khammam

News April 27, 2024

ఖమ్మంలో హీరో వెంకటేశ్ ఎన్నికల ప్రచారం!

image

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు గాను రఘురామిరెడ్డి వర్గీయులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేశ్
నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

News April 27, 2024

నలుగురు నామినేషన్లు తిరస్కరణ

image

ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 41మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News April 27, 2024

రెండవ దశ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశాం: రిటర్నింగ్ అధికారి

image

ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి గౌతమ్, పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ తో కలిసి పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

News April 26, 2024

మే 8 నుంచి కేయూ పీడీసీ మొదటి సంవత్సరం పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయ పీడీసీ మొదటి సంవత్సరం (తెలుగు) పరీక్షలు మే 8 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమల దేవి సంయుక్త ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.inలో సంప్రదించాలన్నారు.

News April 26, 2024

29న ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో…

image

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా ఈనెల 29న సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. అనంతరం 30న సాయంత్రం 5.30 గంటలకు తల్లాడలో, 6.30 గంటలకు కొత్తగూడెంలో రోడ్ షో కొనసాగిస్తారు. 30న రాత్రి కొత్తగూడెంలో బస చేస్తారు. అనంతరం ఒకటో తేదీన మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.

News April 26, 2024

సొంతగూటికి చేరుకున్న ఖమ్మం జిల్లా నేతలు

image

హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం నుండి ఎడవల్లి కృష్ణ, సత్తుపల్లి నుండి సంభాని చంద్రశేఖర్, రామచంద్రనాయక్, కామేపల్లి జడ్పీటీసీ బాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్ హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.

News April 26, 2024

ఖమ్మం: JEE మెయిన్స్‌లో సత్తాచాటిన గురుకుల విద్యార్థులు

image

ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించారని ITDA పీఓ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డీ.ఐశ్వర్య 79.06. శ్రావణి 74.57, నాగేశ్వరి 71.18. అర్హత సాధించారని తెలిపారు.

News April 26, 2024

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 83,600

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ గురువారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు వేగం పెంచనున్నారు. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా జిల్లాలోని 21 మండలాల పరిధిలో 83,600 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 50,513, మహిళలు 33,083, ఇతరులు నలుగురు ఉన్నారు.

News April 26, 2024

30న కొత్తగూడెంలో కేసీఆర్ రోడ్ షో

image

ఈనెల 30వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 30న సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు.

News April 26, 2024

BREAKING.. ఖమ్మం: లారీ ఢీకొని మహిళ మృతి

image

లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మహిళ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు కోదాడకు చెందిన బానోతు భూది(55) అని స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.