Khammam

News April 6, 2024

KMM: భానుడి భగభగ.. ప్రజలు విలవిల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో ఇండ్లలో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు శీతల పానీయాలు తాగుతూ.. సేద తీరుతున్నారు. వృద్ధులు చిన్నారుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇంత ఉష్ణోగ్రత ఉంటే మే నెలలో ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.

News April 6, 2024

KMM: ఆర్టీసీకి ఫుల్ ఆదాయం

image

పెళ్లిళ్లతో పాటు వరుస సెలవులు ఆర్టీసీకి కలిసొస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సంస్థకు ఆదాయం సమకూరుతోందని అధికారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తోడు ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు ఖమ్మం రీజియన్ రూ.1,45,08,008 ఆదాయం సమకూరినట్లు రీజనల్ మేనేజర్ తెలిపారు.

News April 6, 2024

ఖమ్మం: ముగిసిన ఇంటర్ వాల్యుయేషన్

image

ఖమ్మం: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబు పత్రాలను జిల్లాకు పంపించగా  నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబు పత్రాలను దిద్దగా , శుక్రవారంతో వాల్యూయేషన్‌ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.

News April 6, 2024

ఖమ్మం: ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీసు కొలువులు

image

బూర్గంపాడు: ఇటీవల ప్రకటించిన పోలీసు నియామకాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు పోలీసులు ఉద్యోగాలు వరించాయి. అంబేద్కర్ కాలనీకి చెందిన కేసుపాక నాగేశ్వరరావు రాజ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో భాస్కరరావుకు గతంలో పోలీసు ఉద్యోగం రాగా, ప్రసాద్ రావు, రఘురామ్‌లకు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో పోలీసు శాఖలో ఉద్యోగాలు లభించడం పట్ల గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు.

News April 5, 2024

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు.

News April 5, 2024

ఖమ్మం: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

image

చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నగరంలోని బల్లేపల్లిలో నివాసం ఉంటున్న వినయ్ (27) మార్బుల్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఖానాపురం పోలీస్ స్టేషన్ సీఐ భాను ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు

image

మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని, రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారని అన్నారు. BRS నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

News April 5, 2024

ఖమ్మంలో కాంగ్రెస్ సీటు ఎవరికి..?

image

ఖమ్మం లోక్ సభ ఎన్నికకు BRS, BJP నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. కానీ కాంగ్రెస్‌లో టికెట్ పంచాయతీ తెగకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తన భార్యకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండగా.. తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరుతున్నట్లు స్థానికుల్లో చర్చ నడుస్తోంది.

News April 5, 2024

భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తాం: ఈవో

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేస్తామని, రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్ లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

News April 5, 2024

KMM: డయల్ 100కు 4,205 ఫోన్ కాల్స్: సీపీ

image

శాంతిభద్రతల సమస్యలకు సంబంధించి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రవేశపెట్టిన డయల్ 100కు మార్చి నెలలో 4,205 మంది ఫోన్ చేశారని సీపీ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 75 ఫోన్లకు సంబంధించి FIRలు నమోదు చేశామని వెల్లడించారు. వీటిలో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు వంటివి ఉన్నాయని తెలిపారు.