Mahbubnagar

News October 29, 2024

వనపర్తి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా రేమోద్దులలో 36.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 35.2 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా బొల్లంపల్లిలో 34.9 డిగ్రీలు, గద్వాల జిల్లా రాజోలిలో 34.3 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోస్గిలో 33.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News October 29, 2024

సమీకృత గురుకులాలు వద్దు: మధుసూదన్ రెడ్డి

image

సమీకృత గురుకుల ఏర్పాటు సరి కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న గురుకుల విద్యా వ్యవస్థను బాగుపరచాలని అన్నారు. సమీకృత పాఠశాలల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి చర్చల ద్వారా ముందుకు వెళ్లాలని సూచించారు.

News October 29, 2024

PU మాజీ వీసీపై ఫిర్యాదు..!

image

పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనుల్లో కమిషన్లు తీసుకున్నారని, విద్యుత్తు పరికరాలు, ఏసీలు, వాటర్ ఫిల్టర్లు కొని మాయం చేశారని ఆరోపించారు. తన బంధువులకు ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

News October 29, 2024

పీయూలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య చేరువ కానుంది. పీయూలో న్యాయ, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఉన్న డిమాండ్ నెరవేరేబోతోంది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2022లో వనపర్తిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అయింది. ఇప్పుడు పీయూలోను ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల రాబోతోంది.

News October 29, 2024

బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి:  శ్రీనివాస్ గౌడ్

image

రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందని, బీసీ డిక్లరేషన్ వల్ల ఆ పార్టీకి బీసీల ఓట్లు పడ్డాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీలకు అన్యాయం జరిగిందని దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బాధ్యత వహించాలని అన్నారు. ఓబీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.

News October 29, 2024

MBNR: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

image

మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సోనా సుందర్ ఆత్మహత్య చేసుకునేందుకు సోమవారం పాలిటెక్నిక్ కళాశాల వద్ద రైల్వే ట్రాక్ పైకి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన టూ టౌన్ పోలీసులు అతడి లొకేషన్ గుర్తించి సురక్షితంగా పట్టుకుని ప్రాణాలను కాపాడారు. కౌన్సెలింగ్ అనంతరం భార్యకు అప్పగించారు. దీంతో పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు.

News October 29, 2024

MBNR: రుణమాఫీ కోసం ఎదురుచూపులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 3 విడతల్లో మొత్తం 3,40,177 మంది రైతులకు రుణమాఫీ కాగా సాంకేతిక కారణాలతో సుమారు 30వేల మంది ఖాతాల్లో నగదు జమ కాలేదు. DCCB పరిధిలోనే 32,849 మందికి రావాల్సిన రూ.206.19కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అధికారులు, బ్యాంకర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదని బాధితులు అంటున్నారు. అటూ రూ.2లక్షల పైబడిన రుణమాఫీకి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు.

News October 29, 2024

గద్వాల: ‘సర్పంచ్‌గా ఎన్నుకుంటే రూ.2,00,00,000 ఇస్తా’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక ఎన్నికల జోరు మొదలైంది. గద్వాల జిల్లా ఎర్రవల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా తనను ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2 కోట్లు ఇస్తానంటూ గ్రామానికి చెందిన పూల మద్దిలేటి పోస్టు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. జోగులాంబ పొలిటికల్ న్యూస్ అనే వాట్సాప్ గ్రూపులో వచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీపీ ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్ట్ సర్పంచ్‌ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది.

News October 29, 2024

NGKL: కులగణన పరదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని NGKL జిల్లాకలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే ప్రారంభించే దిశగా సమర్థవంతమైన ప్రణాళికల రూపొందించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తతో కులగణన సర్వేను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

News October 29, 2024

సమగ్ర సర్వేకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ సంతోష్

image

నవంబర్ 4 నుంచి 17 వరకు జిల్లాలో చేపట్టే సమగ్ర సర్వేకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. సర్వే కొరకు ఎన్యూమరేటర్లు, ఎన్యూమరేటర్ల బ్లాకులు, హౌస్ లిస్ట్ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. మండలం వారిగా ఎంపీడీవో తహశీల్దార్, మునిసిపాలిటీలో కమిషనర్లు ఎన్యూమరేటర్లను నియమించుకోవాలన్నారు.