Mahbubnagar

News September 20, 2024

MBNR: ఆశావహులతో స్థానిక ఎన్నికలు దోబూచులు

image

పాలమూరు జిల్లా ఆశావహులతో స్థానిక సంస్థల ఎన్నికలు దోబూచులాడుతున్నాయి. ఫిబ్రవరి 2024తో గత పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. సుమారు 9 నెలలు కావస్తున్నా సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలపై స్పష్టత రాలేదు. కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు నిర్ణయించాకే ఎన్నికలు జరుపుతామని సీఎం ప్రకటించారు. దీంతో మరో 4 నెలలు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని, వనపర్తి జిల్లా 255 పంచాయతీల్లో పోటీ చేసే ఆశావాహులంటున్నారు.

News September 20, 2024

పాలమూరు ప్రజలపై నెలకు రూ.3.60 కోట్ల భారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున నెలకు 18 లక్షల కిలోల వంట నూనెలను ప్రజలు వాడుతున్నారు. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి. నూనెల ధరలు సరాసరి ఒక్కో లీటరుపై రూ.20 పెరుగుదల అనుకుంటే..రూ.3.60 కోట్లు ప్రజలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వంటనూనెల పెరుగుదల సంకటంగా మారింది.

News September 20, 2024

రూ. 4.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

image

భారీ గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేలంపాటలో గణేశుడి చేతిలోని లడ్డు ప్రసాదాన్ని మాజీ వార్డు సభ్యులు గడ్డమీది శ్రీనివాసులు రూ. 4.60 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తులు ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

News September 20, 2024

రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలి: సిక్తా పట్నాయక్

image

విద్యలో జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కేజీబీవీ పాఠశాలలో నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపి వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు.

News September 19, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం..

image

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880.6 అడుగుల వద్ద 191.2118 టీఎంసీలుగా ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తంగా జలాశయానికి 21,879 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. భూగర్భ కేంద్రం, ఏపీ జెన్కో పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి మొత్తం 67,156 క్యూసెక్కుల నీటిని వినియో గిస్తున్నారు. భూగర్భ కేంద్రంలో 16.879 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.697 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.

News September 19, 2024

జూరాలకు స్వల్ప వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అతి స్వల్పంగా ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి 18, 500 క్యూసెక్కులు మాత్రమే ఉన్నట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తికి 15,120 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 18,385 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.583 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News September 19, 2024

MBNR: 15 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేరు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 5, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో‌‌ పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

News September 19, 2024

MBNR: ఓటర్ జాబితాలో సవరణలు చేయండి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితాలో ఈనెల 21 వరకు మార్పులు చేర్పులు చేసుకోవాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు, తప్పులను సరిదిద్దడం లాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు.

News September 18, 2024

ప్రపంచ వెదురు దినోత్సవంలో శ్రీనివాస్ గౌడ్

image

వెదురుకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉందని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి నిత్యావసరాలలాగే వెదురు వస్తువులు కూడా ఎంతో అవసరం అన్నారు. ఇలాంటివి తయారు చేసే కార్మికులను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు.

News September 18, 2024

నేటి నుంచి ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె బాట

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె చేయనున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తమకు నెలసరి జీతాలు పెంచాలని, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో తాము చనిపోతే తమ కుటుంబానికి పరిహారం అందించాలని ఆరోగ్యశ్రీ సిబ్బంది తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 94 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొనున్నారు.