Medak

News March 19, 2024

కొల్గూరులో చెట్టు విరిగిపడి బాలుడి మృతి

image

గజ్వేల్ మండలం కొల్గూరులో విషాధచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి చింటూ(15) వ్యవసాయ పొలం వద్ద గల పశువులను ఇంటికి తీసుకువస్తుండగా, భారీ గాలికి చెట్టు విరిగి అతడిపై పడింది. ఈ ప్రమాదంలో చింటూ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఓయూలో దరఖాస్తుల స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 19, 2024

మెదక్: రైలు నుంచి పడి యువకుడి మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం – మాసాయిపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్లోంచి పడి గుర్తుతెలియని 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రయాణిస్తున్న రైల్లోంచి పడి యువకుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News March 19, 2024

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మెదక్ రూరల్ కానిస్టేబుల్

image

మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కాడు. ఓ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేయగా మైనింగ్ శాఖ నుంచి రిలీజ్‌కు అనుమతిచ్చారు. స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఆయన ఆధ్వర్యంలో డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌ను పట్టుకుని విచారిస్తున్నారు.

News March 19, 2024

ఓయూ బీసీఏ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News March 19, 2024

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: సిద్దిపేట సీపీ

image

ముందస్తు ప్రణాళికతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. సిద్దిపేటలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎన్నికల విధులు, విధానాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, పటిష్టమైన బందోబస్తు ఇతరత్రా అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

News March 19, 2024

నార్సింగి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయడం లేదు. దీంతో అతని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో విరక్తి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.

News March 19, 2024

MDK: రూ. 50 వేలకు మించితే సీజ్..!

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంగా తనిఖీలు చేస్తున్నాయి. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. రూ.50 వేలకు మించితే నగదు సీజ్ చేస్తున్నారు. ఎన్నికలకు అనుబంధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్సు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇతరత్రా బృందాలు సోదాలు చేస్తున్నారు.

News March 19, 2024

MDK: భారీ వర్షం.. చిన్నారి మృతి

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో జాజి తండా గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలిపోయి సంగీత(3)కు గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

మెదక్‌: విషాదం.. చేపల వేటకు వెళ్లి మృతి

image

మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీరయ్య అనే వ్యక్తి మరికొందరితో కలిసి మైసమ్మ కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.