Medak

News February 18, 2026

పీఆర్సీపై సీఎం తక్షణమే ప్రకటించాలి: ఎస్టీయూ

image

నూతన పీఆర్సీపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదని పేర్కొన్నారు.

News February 18, 2026

ఏడుపాయలలో తప్పిపోయిన చిన్నారి.. తల్లిదండ్రుల చెంతకు

image

ఏడుపాయల జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను అదనపు ఎస్పీ మహేందర్ క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి మానవీయత చాటుకున్నారు. భక్తుల రద్దీలో ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆయన పాపకు ధైర్యం చెప్పి వివరాలు సేకరించారు. పోలీసు యంత్రాంగం సాయంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. వేల మంది జనాల మధ్య తమ బిడ్డను క్షేమంగా చేర్చిన అదనపు ఎస్పీకి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.

News February 17, 2026

శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

image

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 17, 2026

సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బంజారా సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ నగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి పలు సూచనలు చేశారు.

News February 17, 2026

జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో మెదక్ జిల్లా అధికారి

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ తరఫున మెదక్ జిల్లా నుంచి తూప్రాన్ ఎంపీడీవో నూతికట్టు సతీష్ జాతీయ స్థాయి క్యారమ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. పురుషులు, మహిళల విభాగాలకు చెందిన 16 మంది సభ్యుల బృందానికి ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న సతీష్‌ను పలువురు అధికారులు అభినందించారు.

News February 17, 2026

MDK: భార్య ఛైర్‌పర్సన్.. భర్త కౌన్సిలర్!

image

రామాయంపేట మున్సిపాలిటీలో భార్య భర్తలు మున్సిపాలిటీలో అడుగు పెట్టారు. భార్య గజవాడ లావణ్య ఒకటో వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భర్త నాగరాజు ఏడవ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో రెండవసారి అడుగుపెట్టారు. భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య ఛైర్ పర్సన్, భర్త కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

News February 17, 2026

పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

image

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

News February 16, 2026

పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

image

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News February 16, 2026

పాపన్నపేట: కట్టుదిట్టమైన పార్కింగ్.. ఇబ్బందులకు చెక్!

image

ఏడుపాయల వనజాతరకు వచ్చే భక్తుల కోసం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టేకులగడ్డ, చెలిమెకుంట వద్ద భారీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. బారికేడ్ల సాయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. సోమవారం జరిగిన బండ్ల ఊరేగింపు, మంగళవారం జరగనున్న రథోత్సవానికి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 16, 2026

మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.