Nalgonda

News June 24, 2024

సరికొత్త పాలనకు శ్రీకారం

image

కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా పరిపాలనలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇకపై ప్రతీ సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీనిని నిర్వహించేలా ఇప్పటికే ఆర్డర్స్ పాసయ్యాయి. ఏ సమస్య అయినా 15రోజుల్లో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చు.

News June 24, 2024

అన్నదాతలతో రుతుపవనాలు దోబూచులాట

image

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అన్నదాతలతో దోబూచులాడుతున్నాయి. తొలకరి జల్లులతో పులకరించాల్సిన పుడమితల్లి నోళ్లు తెరిచింది. సకాలంలో వర్షాలు కురిస్తే ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉండేవి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు మెట్ట, మాగాణిభూముల్లో దుక్కులు దున్ని పంటల సాగుకు అనుకూలంగా సిద్ధం చేశారు. అదునులోవర్షాలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదని రైతులు తెలిపారు.

News June 23, 2024

నకిరేకల్, నల్గొండ నాకు రెండు కళ్లు: మంత్రి కోమటిరెడ్డి

image

తాను అధికారంలో ఉన్నా లేకున్నా చచ్చేంత వరకు ప్రజల్లోనే ఉండి ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చిట్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లతో సమానమన్నారు. తన రాజకీయ ప్రస్థానం చిట్యాల నుంచే ప్రారంభమైందని, చిట్యాలకు తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

News June 23, 2024

అమెరికా, దక్షిణ కొరియా నుంచి ఫణిగిరికి బౌద్ధ శిల్పాలు

image

ఫణిగిరి బౌద్ధ శిల్పాలు, జాతక కథలు తెలిపే తోరణాలను గత ఏడాది జులైలో అంతర్జాతీయ ప్రదర్శన నిమిత్తం USలోని న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ మ్యూజియానికి, దక్షిణకొరియా సియోల్‌కి తీసుకెళ్లారు. ప్రదర్శన ముగిసిన అనంతరం శనివారం వీటిని తిరిగి ఫణిగిరి మ్యూజియంలో భద్రపర్చినట్లు ఆర్కియాలజీ AD మల్లునాయక్‌ తెలిపారు. ప్రపంచంలోని పురవస్తు శాఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఫణిగిరి బౌద్ధ శిల్పాలను సందర్శించారని పేర్కొన్నారు.

News June 23, 2024

ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమి పూజ.. కోమటిరెడ్డి, గుత్తా రాక

image

చిట్యాలలో హైవే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూమి పూజ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమానికి రానున్నారు.

News June 23, 2024

సూర్యాపేట: వరకట్నం వేధింపులు, వివాహిత సూసైడ్

image

లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండలో వరకట్నం వేధింపులతో వివాహిత పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. SRPT జిల్లా నడిగూడెం మం. బృందావనపురం గ్రామానికి మానసతో కారుకొండకి చెందిన సంతోశ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం భర్త మానసను వేధిస్తున్నాడు. దీంతో పురుగుల మందు తాగిన మానస సృహ కోల్పోయింది. KMM తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

News June 23, 2024

కిరాయికి ఎద్దులు

image

వానకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ సీజన్ మొదలైంది. నల్గొండ జిల్లాలో చాలా వరకు రైతులు ప్రధానంగా పత్తిని పండిస్తారు. విత్తనాలను విత్తడం, వరుసలు వేయడం, పంటలో కలుపు తీయడానికి గుంటుక కొట్టడం తదితర పనులను ఎద్దుల అవసరం ఉంటుంది. ఎద్దులు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. మనిషితో అయితే రూ.2వేలు, మనిషి లేకుండా కేవలం ఎద్దులే అయితే రూ.1500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.

News June 23, 2024

నల్గొండకు సీఎం రేవంత్: మంత్రి కోమటిరెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నల్గొండ జిల్లాకు రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జరిగిన జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తారని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులు, అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారని తెలిపారు.

News June 23, 2024

నల్గొండలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలోని మున్సిపల్ పార్కులో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మూడు గంటల పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.

News June 22, 2024

నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా

image

ధరణి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. ఎన్నికల కోడ్‌ ముగియడం, జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడంతో పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 16,733 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. సూర్యాపేటలో 7,293, యాదాద్రిలో 8,342 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వచ్చే నెలాఖరులోగా అన్ని అర్జీలు పరిష్కారం అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.