Nizamabad

News June 7, 2024

రెంజల్: పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

image

రెంజల్ మండలం కల్యాపూర్ శివారులో గురువారం పిడుగుపడి దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోత్ పీర్యానాయక్ (80) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కల్యాపూర్ శివారులో పశువులు మేపడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కింద తల దాచుకోగా చెట్టుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.

News June 7, 2024

KMR: అత్యాశకుపోయి రూ. లక్షలు పొగొట్టుకున్నాడు..!

image

కామారెడ్డిలో సైబర్ మోసం జరిగింది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం పట్టణానికి చెందిన శ్రీకాంత్‌కి వాట్సాప్‌కి పార్ట్‌టైం ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి ఉందా అని మెసేజ్ వచ్చింది. దీంతో అతను ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు. మెుదటగా రూ. 9 వేలు కడితే రూ.12 వేలు వస్తాయని ఆశ చూపారు. దీంతో అత్యాశకు పోయి విడతల వారిగా రూ.9.79 లక్షలు చెల్లించాడు. అనుమానం వచ్చిన యువకుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను సంప్రదించాడు.

News June 7, 2024

ఉలిక్కి పడిన నిజామాబాద్.. ఒకే రోజు మూడు చోరీలు

image

NZB నాలుగో ఠాణా పరిధిలో ఒకే రోజు 3 చోరీలు జరిగాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్వాగార్డెన్ వెనకాల రాఘవేంద్ర ఆపార్ట్‌మెంటు మూడో అంతస్తులో ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరేళ్లగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మూడు తులాల బంగారం చోరి జరిగింది. కాగా రుత్విక్ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో చోరీ జరిగింది. అలాగే ఆర్యనగర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో దుండగులు చొరబడ్డారు.

News June 6, 2024

పదేళ్ల తర్వాత జహీరబాద్‌లో కాంగ్రెస్ ఘన విజయం

image

ZHB లోక్ సభ స్థానంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంపీగా సురేశ్ షెట్కార్ భారీ మెజార్టీతో జయ కేతనం ఎగురవేశారు. 2009లో సురేశ్ షెట్కార్ విజయం సాధించారు. ఆ తర్వాత బీబీ పాటిల్ వరుసగా రెండు సార్లు ఎంపీ అయ్యారు. పదేళ్ల తర్వాత అదే స్థానం నుంచి షెట్కార్ MLA టికెట్‌ను త్యాగం చేసి కాంగ్రెస్ MP అభ్యర్థిగా రంగంలో దిగి విజయం సాధించారు.

News June 6, 2024

బాన్సువాడ: నీటి కుంటలో మృతదేహం

image

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన పాల్కి భూమబోయి మూడు రోజుల క్రితం కనిపించకపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇండ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ ఉదయం ఇబ్రహీంపేట్ సబ్ స్టేషన్ ముందర నీటి కుంటలో భూమబోయి మృతదేహం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.

News June 6, 2024

ధర్మపురి అర్వంద్‌కు మంత్రి పదవి..?

image

కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న NDA ప్రభుత్వంలో ఈ సారి తెలంగాణకు రెండు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కిషన్ రెడ్డి లేదా డికే అరుణకు, బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌లో ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

News June 6, 2024

ZHB: ఆరుగురికి ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు

image

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 19 మంది పోటీచేశారు. ఇందులో 10 మంది స్వతంత్రులే. వీరిలో ఎవరికీ 6వేల ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఏడు నియోజకవర్గాల్లో 12,25,049 ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్రులకు 31,079 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2,933 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన 10 మందిలో ఆరుగురికి నోటా కంటే తక్కువ వచ్చాయి.

News June 6, 2024

నిజామాబాద్: అంచనాలకు మించి BJP జోరు

image

నిజామాబాద్ పార్లమెంట్‌లో BJPకి విశ్లేషకుల అంచనాలకు మించి ఓట్లు పోలయ్యాయి. గత ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4.80 లక్షలు ఓట్లు రాగా.. ఈసారి 5.92 లక్షల ఓట్లు వచ్చాయి. NZB రూరల్, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల్లో 15 వేల నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని లెక్కలు కట్టారు. కాని రూరల్ 44వేలు, కోరుట్లలో 33వేలు, బాల్కొండలో 32 వేలు మెజార్టీ దక్కటం గమనార్హం. 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు సాధించడంతో BJP జోరు సాగింది.

News June 6, 2024

NZB: కోడలి సజీవదహనం..అత్తకు రెండు జీవిత ఖైదులు

image

కోడలిని సజీవ దహనం చేసిన అత్తకు 2 జీవిత కారాగార శిక్షలు, రూ. 11వేల జరిమానా విధించింది జిల్లా కోర్టు. నవీపేట మండలం శివతండాకు చెందిన బానోత్ రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాంసింగ్, తల్లి కోడలిని కట్నం తేవాలని వేధించారు. ఈ క్రమంలో 2020 ఏప్రిల్ 20న రాత్రి రాధను రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.

News June 5, 2024

NZB: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

నగరంలోని గాజుల్ పేట్ రామ మందిర్ ప్రాంతానికి చెందిన నారాయణ(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రెడిట్ కార్డు తీసుకుని దాని ద్వారా డబ్బులను డ్రా చేసి వాడుకున్నాడు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ కార్డు రికవరీ టీం ఇంటికి వచ్చి బెదిరించినట్లు 2 టౌన్ ఎస్ఐ రాము తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన నారాయణ తన ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.