Telangana

News September 16, 2024

వరంగల్ : కొడుకు వైద్యానికి డబ్బుల్లేక తండ్రి ఆత్మహత్య

image

అనారోగ్యం బారిన పడ్డ కొడుకును రక్షించుకోవడానికి డబ్బుల్లేక ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లబెల్లి మండలం గోవిందాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కుంజ సునీల్ (28) అతడి 8 నెలల కుమారుడు 2 నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకు వైద్యం కోసం సునీల్ రూ.7లక్షలు అప్పు చేశాడు. అవి సరిపోకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సునీల్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబీకులు తెలిపారు.

News September 16, 2024

ఖమ్మం: డబ్లింగ్ భూసేకరణ నోటిఫికేషన్ విడుదల

image

బోనకల్ మండలం మోటమర్రి గ్రామ రైల్వే స్టేషన్ నుంచి పల్నాడు, విష్ణుపురం గ్రామాల మధ్య డబ్లింగ్ రైల్వే లైన్ భూసేకరణ పనుల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు సంబంధిత రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉన్న వారు ఖమ్మం, నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా తెలిపారు.

News September 16, 2024

KNR: నేడు గంగమ్మ ఒడికి గణనాథులు

image

నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNRజిల్లా అంతటా గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,325 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

News September 16, 2024

NZB: ఎడ్ల బండిలో వినాయకుడి నిమజ్జనం

image

నిజామాబాద్‌లోని మంచిప్ప గ్రామలో ఇద్దరు స్నేహితులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామానికి చెందిన గంగాధర్, విలాస్ తమ గల్లీ వినాయకుడిని నిమజ్జనానికి ఎడ్ల బండిపై తరలించారు. ఎడ్లకు బదులుగా వారే తమ భుజాలతో బండిని లాగుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వాహనాలకు బదులుగా స్వామివారిని తమ భూజాలపై మోసుకెళ్లి నిమజ్జనం చేయడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

News September 16, 2024

ఒక్కటైన అమెరికా అమ్మాయి, వనపర్తి అబ్బాయి

image

వనపర్తి జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. వనపర్తిలోని రాజనగరం రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్‌లో అమెరికా అమ్మాయి నాతలీజో, పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత తమ్ముడు, శాస్త్రవేత్త నరేశ్ యాదవ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక, రాజకీయ నేతలు పాల్గొని జంటను ఆశీర్వదించారు. పెళ్లి కుమార్తె విదేశీ అమ్మాయి కావడంతో ఈ వేడుక పట్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

News September 16, 2024

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

image

మహమ్మద్ ప్రవక్త మిలాద్-ఉన్-నబీ జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిదక్ (సత్యనిష్ట) తహారత్ (పవిత్రత) జకాత్ (సహాయం) రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.

News September 16, 2024

సిద్దిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఎక్కువగా కురిసిందని తెలిపారు.

News September 16, 2024

HZB: వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు

image

సోమవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా హుజూరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. ☞విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి. ☞నీటిలో క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను వేయాలి. ☞ఈత రాని వారు నీటి వద్దకు వెళ్లకూడదు. ☞హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ☞వాహనాలలో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.

News September 16, 2024

మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సురేఖ

image

పవిత్ర హృదయంతో కూడిన ప్రతి మనిషికి ఈ భూమి యావత్తు ప్రార్థనాస్థలమేనన్న మహమ్మద్ ప్రవక్త మాటలు స్ఫూర్తిదాయకమైనవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ పండుగ (సెప్టెంబర్ 16) ను పురస్కరించుకుని మంత్రి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయ ప్రజల పై వుండాలని మంత్రి ఆకాంక్షించారు.

News September 16, 2024

మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం

image

మంచిర్యాల కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.