Telangana

News April 5, 2024

నాగార్జునసాగర్ నీటి మట్టం వివరాలు..

image

 నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్‌కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.

News April 5, 2024

వరంగల్ RDO ఆఫీసు జప్తు

image

తెలంగాణ హైకోర్టు తీర్పుతో వరంగల్ RDO ఆఫీసును అధికారులు జప్తు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్క్ కోసం భూమి ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం అందలేదు. దీనిపై రైతు సముద్రాల స్వామి, అతడి కూతురు వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాలని గతంలో ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంతో RDO ఆఫీసు జప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

News April 5, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు సంచారం

image

ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 120 మంది సిబ్బందితో ట్రాకింగ్ నిర్వహిస్తున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో సంచరిస్తున్న ఏనుగును కెమెరాలో బంధించారు. ఇప్పటికే జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు అటవీ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.

News April 5, 2024

సూర్యాపేటలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేటలో జరిగింది. రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. రాయినిగూడెం సెవెన్ స్టార్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని గుర్తిస్తే సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తెలియజేయలన్నారు. 8712686006, 8712683060 నంబర్లను సంప్రదించాలని ఎస్సై బాలునాయక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

News April 5, 2024

8న నాగర్ కర్నూల్‌కు కేటీఆర్ రాక

image

ఈ నెల 8న మాజీ మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్ రానున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో సమావేశం ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News April 5, 2024

ఖమ్మం: లవ్‌ ఫెయిల్.. డెలివరీ బాయ్ సూసైడ్

image

ప్రేమ విఫలమై జీవితంపై విరక్తి చెందిన ఓ డెలివరీ బాయ్ సూసైడ్ చేసుకొన్న ఘటన HYD కూకట్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన షేక్ షాజహాన్(30) భాగ్యనగర్‌కాలనీలో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమను అమ్మాయి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకొన్నాడు.

News April 5, 2024

కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: MLA

image

కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలేరు మండలంలోని షోడషపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిన నేతలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

News April 5, 2024

పార్టీ మారే ప్రసక్తే లేదు: గంగుల

image

కరీంనగర్ MLA, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ మారుతున్నారనే పలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. గురువారం ఆయన కరీంనగర్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు బురద జల్లుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనకే రైతులు ఆగమయ్యారని, వారిని ఆదుకునేందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని తెలిపారు.

News April 5, 2024

హైదరాబాద్‌లో బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటు నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు.

News April 5, 2024

సంగారెడ్డి: లోన్ యాప్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య

image

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఓ గ్రామంలో లోన్ యాప్ వేధింపులతో మనస్తాపానికి గురై యువకుడు శ్రీకాంత్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకోగా, నాలుగు నెలల వ్యవధిలో రూ.1,30,000 చెల్లించాడు. మరో రూ.80వేలు చెల్లించాలని వేధించారు. అశ్లీల పోస్టులు చేయడంతో మనస్తాపానికి గురై గత నెల 30న పురుగు మందు తాగాడు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.