Telangana

News April 2, 2024

MP ఎన్నికలు: హైదరాబాద్‌‌లో తీవ్ర పోటీ..!

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానిలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి‌‌, హైదరాబాద్‌లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజాఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్‌ నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో‌ తీవ్ర పోటీ నెలకొంది.

News April 2, 2024

ఉష్ణోగ్రతల్లో రాష్ట్రంలోనే మల్లాపూర్ టాప్

image

జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మల్లాపూర్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.

News April 2, 2024

నెక్కొండ: గుప్త నిధుల కోసం గుట్టుగా తవ్వకాలు

image

నెక్కొండ మండలం వెంకట్ తండా గ్రామ పంచాయితీ పరిధిలోనీ పురాతన గంగమ్మ తల్లి ఆలయ అవరణలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను గ్రామస్థులు గుర్తించారు. ఆలయ ఆవరణలో పెద్ద గుంత తీసి దాని పక్కనే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండటంతో గుప్త నిధుల కోసమేనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో తవ్వకాలు జరిపారని గ్రామస్థులు తెలిపారు.

News April 2, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,375 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.25 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 2, 2024

వనపర్తి: అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

image

ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన పెబ్బేర్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయి ప్రసాద్ రెడ్డి వివరాలు.. మండల కేంద్రంలోని పాత చౌడేశ్వరి ఆలయ సమీపంలో నివసిస్తున్న సరస్వతి (29) ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

News April 2, 2024

సిద్దిపేట జిల్లా వాసికి మిస్ టీన్ గెలాక్సీ టైటిల్

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో USAలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

News April 2, 2024

NZB: వాహన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం

image

నిజామాబాద్‌లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు 1టౌన్ SHO విజయ్ బాబు తెలిపారు. కుమార్ గల్లీలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంగ ప్రసాద్ అనే వ్యక్తి ఎలాంటి అక్రమంగా రూ.6,89,500 నగదు, రూ.34,89,500 విలువైన 400 గ్రామాల బంగారు బిస్కెట్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నగదు, బంగారాన్ని సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 2, 2024

మంచిర్యాల: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం సోమవారం లభించినట్లు CI కుమారస్వామి తెలిపారు. తాండూర్ IB సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ అలీ(33) శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అబ్బాపూర్ ఓసీపీ పరిసరాల్లో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఇది హత్యా? లేకా ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు CI వెల్లడించారు.

News April 2, 2024

స్తంభం పైనుంచి పడి కేబుల్ కార్మికుడి దుర్మరణం

image

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో విద్యుత్ స్తంభం పైనుంచి పడి కేబుల్ కార్మికుడు దుర్మరణం చెందాడు. చిల్లకల్లు పోలీసుల కథనం మేరకు.. దామరచర్ల మండలం బల్లిగుంట తండాకు చెందిన కిరణ్ (30).. చిల్లకల్లు కేబుల్ పనుల గుత్తేదారు వద్ద పనిచేస్తున్నాడు. విద్యుత్ స్తంభానికి అమర్చాల్సిన కేబుల్ తీగ కోసం నిచ్చెన సాయంతో పైకి ఎక్కాడు. అకస్మాత్తుగా పైనుంచి పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగి చనిపోయాడు.

News April 2, 2024

వరంగల్: దివ్యాంగుల కోసం ఈ నెలలో సదరం క్యాంపులు

image

WGL జిల్లాలో దివ్యాంగుల కోసం ఈనెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు DRDO కౌసల్యాదేవి తెలిపారు. మూగ, చెవిటి వారికి 12న, శారీరక (ఆర్థో) విభాగానికి 18, 19, 20 తేదీలు, మానసిక దివ్యాంగులకు 22న ఎంజీఎం ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రిలో కంటి సమస్యలకు సంబంధించిన క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగత్వం ఉన్న వారు మీ సేవ కేంద్రాల్లో నేడు ఉదయం 11 నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.