Telangana

News August 28, 2024

పూర్తిగా నిండిన శ్రీశైలం జలాశయం

image

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. వరద నీటితో డ్యాం పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులు ఉంది. జూరాల నుంచి వరద వస్తుండటంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు

News August 28, 2024

KMR: ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్

image

వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు ఉద్భోదించారు. బుధవారం కలెక్టర్ మండలంలోని గర్గుల్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి, వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.

News August 28, 2024

మెదక్: మళ్లీ ‘ప్రజాపాలన’.. రేషన్ కార్డులు దక్కేనా..?

image

సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు మళ్లీ ప్రజాపాలన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారైనా కొత్త రేషన్ కార్డులు అందుతాయన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండవ విడత ప్రజాపాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటిసారి ప్రజాపాలనలో మెదక్ జిల్లాలో ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రేషన్ కార్డుల కోసం 2.23.357 దరఖాస్తులు వచ్చాయి.

News August 28, 2024

ఆసిఫాబాద్: కలెక్టరేట్ వద్ద ఐకేపీ వీవోఏల ధర్నా

image

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఐకేపీ వీవోఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఐకేపీ వీవోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

News August 28, 2024

KTR చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్

image

బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. గోషామహల్‌లోని తన కార్యాలయంలో మాట్లాడారు. బండి సంజయ్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని రాజాసింగ్ ప్రశ్నించారు. కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో BRS విలీనం కావడం తథ్యం అని రాజాసింగ్ పేర్కొన్నారు.

News August 28, 2024

కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News August 28, 2024

నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

image

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 11 గేట్లు ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,26, 796 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 590.00 అడుగులుగా ఉంది. 

News August 28, 2024

వరంగల్ రాజముద్ర వివాదంపై ఎక్స్‌లో స్పందించిన KTR

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంపై కేటీఆర్ ‘X’లో స్పందించారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? లేక అనాధికారిక నిర్ణయమా?.. అసలు ఏం జరుగుతుందో మీకైనా తెలుసా?’ అంటూ తెలంగాణ సీఎస్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. తెలంగాణ రాజముద్రను ఆమోదించక ముందే ఇలా ఫ్లెక్సీలో ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News August 28, 2024

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.

News August 28, 2024

రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్..!

image

బేగంబజార్‌లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇటీవల ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు.