Telangana

News July 5, 2024

నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు

image

MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

News July 5, 2024

మహబూబ్ నగర్: 8న అప్రెంటిస్ షిప్ మేళా

image

MBNR:ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 8న జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాను ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బయోడేటా, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్,2 పాస్ ఫొటో సైజ్ ఫొటోలతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాల సెట్ తో హాజరు కావాలన్నారు.

News July 5, 2024

కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచారం

image

సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.

News July 5, 2024

మధిరలో తెల్లవారుజామున రైలు కింద పడి మృతి

image

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. లోకో పైలట్ సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

News July 5, 2024

పీయూకి రూ.100 కోట్లు వచ్చాయి

image

పాలమూరు యూనివర్సిటీకి పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చాయి. ప్రధాన మంత్రి శిక్ష ఉచ్ఛతర్ అభియాన్(పీఎంయూఎసెచ్ఎ) పథకం కింద రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.78 కోట్లు కొత్త హాస్టళ్లు, బిల్డింగుల కోసం ఖర్చు చేయనున్నారు. భవనాలు, ఇతర మైనర్ రిపేర్ల కోసం రూ.3.60 కోట్లు, ల్యాబ్ లలో అత్యాధునిక పరికరాల కోసం రూ.14.26 కోట్లు, రీసెర్చ్, బోధన, శిక్షణ తదితర వాటి కోసం 3.22 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.

News July 5, 2024

భీంపూర్: ఐదు తరగతులు.. ఒకే ఉపాధ్యాయుడు

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఐదు తరగతులకు కలిపి మొత్తం 81 మంది విద్యార్థులు ఉండగా.. ఒకే ఒక్క ఉపాధ్యాయుడు పని చేస్తున్నారు. మూడు పోస్టులు ఉండగా, ఏడాది క్రితం ఒకరు అనారోగ్యంతో చనిపోగా.. ఒకరు ఇటీవల పదోన్నతిపై వెళ్లారు. ఇప్పుడున్న టీచర్ సైతం బదిలీ కాగా, రిలీవర్ రాకపోవడంతో అయన ఉండిపోయారు. అందరినీ ఒకచోట కూర్చోబెట్టి బోధిస్తున్నారు.

News July 5, 2024

నల్గొండ: ప్రాణాలు తీస్తున్న కరెంటు తీగలు

image

కరెంటు తీగలు మనుషులు, పశువుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు ఏడాదిలోనే 43 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 65 మూగజీవాలు చనిపోయాయి. జిల్లా అధికారుల లెక్క ప్రకారం గాయపడిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఆ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

News July 5, 2024

వనపర్తి: బాలికపై బాబాయి అత్యాచారం

image

వనపర్తి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలికపై సొంత చిన్నాన్నే(20) అత్యాచారానికి పాల్పడ్డాడు. SI మంజునాథ్ రెడ్డి వివరాలు.. కొత్తకోటకు చెందిన దంపతులు ముగ్గురి పిల్లలను బంధువుల వద్ద పెట్టి వలస వెళ్లారు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లల వద్దకు వచ్చిన చిన్నాన్న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడగా కేకలు వేసింది. ఇద్దరు చెల్లెళ్లు ఏడ్చుకుంటూ వచ్చి స్థానికులకు చెప్పారు. నిందితుడు పారిపోగా కేసు నమోదైంది.

News July 5, 2024

HYD: జూలై 7 నుంచి MMTS సేవల పునరుద్ధరణ!

image

HYD నగరంలో జులై 6 వరకు పలు MMTS రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. జులై 7 నుంచి సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ లింగంపల్లి (47222), లింగంపల్లి మేడ్చల్(47225), మేడ్చల్ సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్ మేడ్చల్ (47236), మేడ్చల్ సికింద్రాబాద్ (47237) సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 5, 2024

ఏడుగురికి ఏఎస్ఐగా పదోన్నతి

image

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో వెంకటేశ్వర్లు(698), పద్మ కుమార్ (1537), శైలజ (2247), బాలస్వామి (608), బసవ నారాయణ (1994), వెంకటకృష్ణ (428), సూర్యచంద్రరావు (384) ఉన్నారు. వీరికి ఒకటి రెండు రోజుల్లో పోస్టింగ్ కేటాయించే అవకాశం ఉంది.