Telangana

News March 24, 2024

నల్గొండ: వృద్ధురాలు దారుణ హత్య

image

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణిలోని వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న ఔరవాణి గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ (68) అదృశ్యమైంది. అప్పటి నుంచి వెతుకుతున్నా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం దొరికింది. పిచ్చమ్మను దుండగులు హత్య చేసి బావిలో పడేశారని పోలీసులు తెలిపారు.

News March 24, 2024

NZB: ‘హజ్ యాత్రికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’

image

హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మక్కాకు వెళ్ళిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో జిల్లా హజ్ సొసైటీ మౌలానా సయ్యద్ అబీద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ హజ్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ముహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు.

News March 24, 2024

ధర్మపురిలో కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారి తెప్పోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.

News March 24, 2024

NGKL: వేడినూనె మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి

image

ఆమనగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ బలరాం తెలిపిన వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన అర్జున్.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బ్రహ్మోత్సవాల సందర్భంగా తినుబండారాల దుకాణం ఏర్పాటు చేశాడు. అయితే దుకాణానికి అతడితో పాటు వచ్చిన కుమారుడు జయదేవ్(3) అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె ఒంటిపై పడింది. చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం మృతిచెందాడని ఎస్ఐ తెలిపారు.

News March 24, 2024

లోకేశ్వరంలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయలైన ఘటన లొకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన అభిషేక్, జితెందర్ భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. బైక్ పై ఆదివారం నిజామాబాద్ వెళ్తుండగా పంచగుడి గోదావరి వంతెనపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా జితెందర్‌కు తీవ్రగాయాలనైనట్లు పేర్కొన్నారు.

News March 24, 2024

ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

image

పదవ తరగతి పరీక్షలు రాస్తున్న పాత సూరారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్ అనే విద్యార్థి ఆదివారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.

News March 24, 2024

భర్తను హత్యచేయించిన భార్య

image

తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఈ నెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడు కిరాయి వ్యక్తులతో భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. భార్య, ఐదుగురు నిందితులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2బైకులు, కారు, పుస్తెలతాడు,5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 24, 2024

MBNR: వారం రోజుల్లో ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కే !

image

ఉమ్మడి జిల్లాలో 3,068కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, 55 ఎమ్మార్సీలు, 208 సీఆర్సీలున్నాయి. వీటికి మొదటి విడతలో రూ.5.54 కోట్లు, రెండో విడతగా రూ.5.54 కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధులను వారం రోజుల్లో మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే వెనక్కి వెళ్లిపోతాయి. స్టేషనరీ, పాఠశాల మరమ్మతులు, రంగులు వేయడానికి, ప్రయోగాలు, ఆటలు ఆడించేందుకు తదితర వాటి కోసం నిధులను ఉపయోగించి బిల్లులు అప్ లోడ్ చేయాల్సి ఉంది.

News March 24, 2024

పాపన్నపేట: వన దుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో తిక్కిరిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గా భవాని మాత దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో అమ్మ దర్శనానికి చాలా సమయం పట్టింది. వన దుర్గ భవాని మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
>>>SHARE IT