Telangana

News June 28, 2024

కరీంనగర్: నర్సింహులపల్లిలో అరుదైన విగ్రహం!

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లిలో నాలుగో శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తున్న అరుదైన వరాహమూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో ఇదే గ్రామంలో పురాతన రాతి పరికరాలు లభించినట్లు వారు గుర్తు చేశారు.

News June 28, 2024

కరీంనగర్: 4 వరకు బీ ఫార్మసీ పరీక్ష ఫీజు గడువు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీ ఫార్మసీ (ఎనిమిదో సెమిస్టర్) పరీక్ష ఫీజు గడువు జులై 4 వరకు ఉందని ఎస్‌యూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో జులై 8 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

గట్టు: గాలిలో దీపంలా సబ్ స్టేషన్ ఆపరేటర్స్ జీవితాలు

image

విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. సకాలంలో సేఫ్టీ మెటీరియల్ అందించకపోవడం, ఏబి స్విచ్‌లు మరమ్మత్తులు చేయకపోవడం తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గట్టు మండలంలోని ఆలూరు గ్రామంలోని సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆపరేటర్ లక్ష్మణ్ నిన్న విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. ఏబీ స్విచ్‌లు డైరెక్ట్‌గా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు తెలిపారు.

News June 28, 2024

NLG: జీరో బిల్లు, గ్యాస్ రాయితీ కోసం ఎదురుచూపు!

image

ఉమ్మడి జిల్లాలో జీరో విద్యుత్ బిల్లు, గ్యాస్ రాయితీకి లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. చాలామందికి రూ.500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తించడం లేదు. SRPT జిల్లాలో 1,49,887, నల్గొండ జిల్లాలో 1,91,053, యాదాద్రి జిల్లాలో 1,26,431 మంది లబ్ధిదారులు గృహజ్యోతి లబ్ధి పొందుతున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వేల మంది లబ్ధిదారులు గృహజ్యోతి, జీరో బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

News June 28, 2024

KMM: సర్వీస్‌ గన్‌తో కాల్చుకొని జవాన్ సూసైడ్ అటెంప్ట్!

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన రామ్‌పురంలో 15వ CAF బెటాలియన్‌కు చెందిన మనోజ్ దినకర్ అనే జవాన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. జవాన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనోజ్ తన సర్వీస్ గన్‌తో కాల్చుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జవాన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

News June 28, 2024

పాకాల వెళ్లే పర్యాటకులకు శుభవార్త!

image

పాకాల వెళ్లే పర్యాటకులకు రెట్టింపు ఆనందం కలగనుంది. కొన్ని రోజులుగా నిలిచిన బోటు షికారు మళ్లీ ప్రారంభం కానుంది. గతంలో పాకాల సరస్సు WGL జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. జిల్లాల పునర్విభజనతో కొంత భాగం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో చేరింది. దీంతో అటవీ, పర్యాటక శాఖల మధ్య టికెట్ల పంపిణీలో తలెత్తిన కారణాలతో బోటు షికారు నిలిచింది. కాగా స్థానిక MLA చొరవతో బోటింగ్ మళ్లీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

News June 28, 2024

పిట్లం: మంజీర నదిలో దూకి మహిళ ఆత్మహత్య

image

పిట్లం మండలం కారేగాం గ్రామానికి చెందిన సుగుణ(36) బొల్లక్‌పల్లి గ్రామ సమీపంలోని మంజీరానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆటువైపు వెళ్తున్న వారు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. దీంతో పిట్లం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సుగుణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సుగున భర్త మృతిచెందగా ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

News June 28, 2024

గోదావరిఖని: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

గోదావరిఖని పట్టణంలోని ఓ కాలనీలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, మరి కొందరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.

News June 28, 2024

MBNR: పాలమూరు రాష్ట్రంలోనే అవినీతిలో NO.1

image

ఈ ఏడాది అవినీతి కేసుల నమోదులో పాలమూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధికంగా అవినీతి కేసులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ నెల 26 వరకు మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖకు సంబంధించి మూడు, రెవెన్యూ, విద్యుత్ శాఖలవి రెండు చొప్పున, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలవి ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

News June 28, 2024

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం వై జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక ఉన్న లారీలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.