Telangana

News June 25, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.1967 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్‌లో 800 క్యూసెక్కులుగా ఉంది.

News June 25, 2024

HNK: ఈనెల 29 నుంచి వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

News June 25, 2024

కామారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయులుగా పని చేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నారా గౌడ్ తెలిపారు. పాఠశాలలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈనెల 29 లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News June 25, 2024

KMM: చికిత్స పొందుతూ తల్లి, కొడుకు మృతి

image

ముదిగొండ మండలం సువర్ణపురం వద్ద రెండు రోజుల క్రితం రఘునాథపాలెం(M) చిమ్మపూడికి చెందిన తల్లి, కొడుకు కనతాల లక్ష్మమ్మ(55), శేషగిరి(36) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా వీరు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో మృతుల బంధువులు ఫిర్యాదు చేశారు.

News June 25, 2024

నిజామాబాద్‌లో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె

image

నిజామాబాద్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రెండో రోజు మంగళవారం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

News June 25, 2024

లోక్‌సభకు తొలిసారి డీకే అరుణ.. మూడోసారి మల్లురవి

image

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన MBNR నుంచి డీకే అరుణ, NGKL నుంచి మల్లురవి ఎంపీలుగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. డీకే అరుణ 1994లో టీడీపీ నుంచి, 2019లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో గెలుపొందిన అరుణ(బీజేపీ) తొలిసారి పార్లమెంట్‌లో కాలు పెట్టబోతున్నారు. అటూ 1991, 96లో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మల్లు రవి.. 3వ సారి లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News June 25, 2024

MBNR: పీసీసీ చీఫ్ రేసులో సంపత్ కుమార్..?

image

MBNR: పీసీసీ చీఫ్ రేసులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 27తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. గత మూడు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. దీంతో కొత్తగా ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

News June 25, 2024

కొత్తగూడెం: వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

image

గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా ఓసీల్లో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రోజుకు 1.60 లక్షల టన్నులకు గాను 1.10లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. కొత్తగూడెం రీజియన్‌లోని ఇల్లెందులో 11వేల టన్నులకు గాను 6వేల టన్నులు, కొత్తగూడెం ఏరియాలో 40వేల టన్నులకు 30వేలు, మణుగూరు ఏరియాలో 35వేల టన్నులకు గాను 25వేల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు.

News June 25, 2024

ADB: ఆఖరి రోజు కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఈనెల 23న ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన POLYCET సర్టిఫికెట్ వేరిఫికేషన్ 3 రోజులుగా కొనసాగుతోంది. కాగా కౌన్సెలింగ్ ప్రక్రియ నేటితో ముగియనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలిసెట్ కో ఆర్డినేటర్ భరద్వాజ ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం, సోమవారం సర్టిఫికెట్‌లు సమర్పించని విద్యార్థులు నేడు తీసుకొచ్చి వేరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు.

News June 25, 2024

నల్గొండ జిల్లాలో పత్తి మొక్కలకు జీవం

image

పొడి దుక్కుల్లో విత్తనాలు వేసిన రైతుల ఆశలు మొలకెత్తుతున్నాయి. మొలిచిన పత్తి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. సోమవారం 16 మండలాల్లో 2.0 మి.మీ వర్షం కురిసింది. 4 రోజులుగా నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో పంటల సాగుకు అనుకూలమైన వర్షం పడటంతో పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వ్యవసాయ శాఖ అంచనా మేర 2 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు.