RangaReddy

News August 18, 2024

HYD: డెంగ్యూ విజృంభణ.. జర జాగ్రత్త..!

image

రోజు రోజుకూ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. HYD సహా శివారు ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తోంది. పారిశుద్ధ్య లోపానికి తోడు వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి డెంగ్యూ విజృంభిస్తోంది. HYD జిల్లాలో అత్యధికంగా 1,276, మేడ్చల్‌లో 312, రంగారెడ్డిలో 180, వికారాబాద్‌లో 7 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డెంగ్యూ దోమలను నియంత్రించే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

News August 18, 2024

HYD: రాఖీ కడుతుందని అనుకున్నారు.. ఇంతలోనే విషాదం

image

HYD ఉప్పల్ పరిధి హబ్సిగూడలో శనివారం రోడ్డు ప్రమాదంలో <<13876672>>విద్యార్థిని సాత్విక(16)<<>> మరణించిన విషయం తెలిసిందే. తార్నాకలోని కింతి కాలనీ వాసి రంగ గోపీనాథ్ గౌడ్ రైల్వే ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులతో పాటు కూతురు సాత్విక సంతానం. ఒక్క రోజైతే రాఖీ పండుగ.. ఇంతలోనే తన ఒక్కగానొక్క గారాలపట్టి కూతురు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఏసీపీ జగన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 18, 2024

HYD: వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పించాలి: తమ్మినేని

image

వైద్యుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మహిళా వైద్యులకు, సిబ్బందికి భద్రత కల్పించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించి నిందితులను కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

News August 18, 2024

HYD: రైతులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే

image

రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయకపోవడంతో కాంగ్రెస్ అసలు స్వరూపం మరోసారి బయటపడిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏ.మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 60 లక్షల మందికి రూ.49,500 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 22లక్షల మందికి రూ.17,900 కోట్ల రుణాలు మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని, రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

News August 18, 2024

HYD: హరీశ్‌రావు నాటకాలాడుతున్నారు: కాంగ్రెస్ ఎంపీ

image

‘ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం.. సవాల్ విసిరిన హరీశ్‌రావు రాజీనామా చేయమంటే నాటకాలాడుతున్నారు’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన HYD గాంధీభవన్‌లో మాట్లాడారు. గత BRS సర్కార్ రూ.లక్ష రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తే బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదని విమర్శించారు. ఇకనైనా హరీశ్ రావు నాటకాలు ఆపాలన్నారు.

News August 18, 2024

సికింద్రాబాద్: పార్ట్ టైం జాబ్ అని రూ.8.62 లక్షలు లూటీ

image

కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారికి ఆన్‌లైన్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. మొదటగా కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇచ్చారు. తర్వాత పెట్టుబడి పెట్టాలని సూచించగా.. నమ్మిన బాధితుడు రూ.8.62 లక్షలు పెట్టేశారు. తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News August 18, 2024

GHMCలో వారందరికీ స్థాన చలనం

image

GHMCకి కొత్తగా వచ్చిన అధికారులకు బాధ్యతల అప్పగింత, ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్న పలువురికి అంతర్గత స్థానచలనం కల్పించే ప్రక్రియ మొదలైంది. పారిశుద్ధ్య, ప్రణాళిక విభాగాల్లోని పలువురు అధికారులకు బాధ్యతలు కేటాయిస్తూ కమిషనర్ ఆమ్రపాలి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత బదిలీలు ఇంకా ఉంటాయని, వేర్వేరు విభాగాల్లో రెండేళ్లుగా ఒకే స్థానంలో ఉన్న అధికారులు, సిబ్బందికి స్థాన చలనం ఉంటుందన్నారు.

News August 18, 2024

HYD: ట్రాఫిక్ సమస్యలపై సీపీలు, ట్రాఫిక్ అధికారులతో డీజీపీ సమీక్ష

image

HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, ట్రాఫిక్ అధికారులతో DGP డా.జితేందర్ సమావేశమై, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సమస్యలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, ట్రాఫిక్ రద్దీకి గల కారణాలు, రద్దీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

News August 18, 2024

HYD: భారీ వరద.. హుస్సేన్ సాగర్ గేట్లు OPEN

image

భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్‌లోకి వరద పెరిగిందని, దీంతో నీటిని దిగువకు వదిలామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 2,075 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ఫ్లో 1,538 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలామని చెప్పారు.

News August 18, 2024

ఓయూలో పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు

image

ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీలోగా చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలకు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.