Warangal

News July 31, 2024

26.5 అడుగులకు చేరిన పాకాల నీటి మట్టం

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం ఉదయం నాటికి 26.5 అడుగులకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పాకాల సరస్సులోకి వచ్చి చేరుతోంది. కాగా పాకాల పూర్తి స్థాయి నీటిమట్టం 30.3 అడుగులుగా ఉంది. ఇలాగే వరద నీరు సరస్సులోకి వస్తే కొన్ని రోజుల్లోనే అలుగు పడుతుందని రైతులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News July 31, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర మోస్తారుగా పెరిగింది. నిన్న రూ.7,060 పలికిన క్వింటా పత్తి ధర.. నేడు రూ.7,130కి పెరిగింది. దీంతో రైతన్నలకు కొంత ఊరట లభించినట్లు అయింది. ధరలు మరింత పెరగాలని, ఇందుకు అధికారులు, వ్యాపారులు సహకరించాలని రైతులు కోరుతున్నారు.

News July 31, 2024

MHBD: గంజాయి అక్రమ రవాణా.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

MHBD జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. డోర్నకల్ పీఎస్ పరిధిలో 2021 అక్టోబర్ 10న బానోత్ కిరణ్, బాదావత్ సూర్య 300 కిలోల గంజాయిని ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలో పెట్టి తరలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదైంది. దీంతో నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా కోర్టు జడ్జి చంద్రశేఖర ప్రసాద్ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించారు.

News July 31, 2024

వరంగల్: 77 మంది స్టాఫ్ నర్సుల బదిలీ

image

ఎంజీఎం ఆసుపత్రిలో చాలా కాలంగా పని చేస్తున్న స్టాఫ్ నర్సులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆసుపత్రిలో మొత్తం 478 మంది స్టాఫ్ నర్స్‌లు పని చేస్తున్నారు. అందులో నాలుగేళ్లకు పైగా ఇక్కడే ఉంటున్న వారితో పాటు మూడేళ్లు పూర్తయి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న 230 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉత్తర్వులు అందుకున్న వారు తక్షణమే విధుల్లో చేరాలని పేర్కొన్నారు.

News July 30, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్.

image

> WGL: ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
> HNK: బైకును ఢీకొన్న లారీ.. యువకుడు మృతి
> MLG: పుష్కర ఘాటులో కొట్టుకొచ్చిన మృతదేహం
> JN: జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్
> WGL: ఇంట్లోకి చొరబడి దొంగల హల్చల్
> WGL: సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
> MHBD: డోర్నకల్ మండలంలో కొండచిలువ ప్రత్యక్షం

News July 30, 2024

MHBD: డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందించాలి: ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ఆదేశాల మేరకు జిల్లాలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బందితో డీఎస్పీ తిరుపతి రావు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. బాధితులు 100కు కాల్ చేయగానే, సమాచారం వచ్చిన వెంటనే బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బంది తక్షణమే స్పందించి ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ధైర్యం అందించాలని సూచించారు.

News July 30, 2024

హనుమకొండ: బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

image

హనుమకొండ జిల్లా మామునూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నుండి మిర్చి లోడుతో ఖమ్మం వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట మండలం సింగారం గ్రామానికి చెందిన అఖిల్ (20)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 30, 2024

WGL: మావోయిస్టు లేఖ కలకలం

image

ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మావోయిస్టు లేక కలకలం సృష్టిస్తోంది. ఏటూరు నాగారం- మహాదేవపూర్ దళంలోని జైసింగ్, రమేశ్, సుక్కి అనే ముగ్గురిని చర్లలో పోలీసులు పట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిని చిత్రహింసలు పెట్టి, ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారికి ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

News July 30, 2024

వరంగల్: ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయలను వేశారు. మరో తరగతి గదిలో సైతం కనిపించాయి. దీంతో వరుస సెలవుల అనంతంరం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వీటిని చూసి భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ పని ఎవరు చేశారనేది తెలియరాలేదు.

News July 30, 2024

పోలీస్ కమిషనర్ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా!

image

వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు. ఫ్రెండ్స్ రిక్వెస్టు పంపిస్తున్నారు. దీన్ని ఎవరూ అనుమతించవద్దని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ ఫేస్‌బుక్ ఐడీలు సృష్టించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.