Warangal

News March 18, 2024

భూపాలపల్లి: ఆస్కార్‌ గుర్తుగా.. గ్రంథాలయం

image

ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తన సొంతూరు చల్లగరిగేలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టారు. పురస్కారానికి గుర్తుగా తన సతీమణి సుచిత్ర ఆలోచన మేరకు గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆంగ్ల అక్షరం ‘O’ ఆకారంలో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.

News March 18, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పలు రకాల సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,400 ధర పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17వేల ధర రాగా, 5531 మిర్చికి రూ.13వేల ధర, టమాటా రకం మిర్చికి రూ.37,000 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 18, 2024

హనుమకొండ: దాడి చేసిన 9మందిపై కేసు

image

హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాగరాజు, గణపురం గ్రామానికి చెందిన శ్రావణి ప్రేమించి ఈ నెల 12న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 14న శాయంపేటకు పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈక్రమంలో 16న బంధువులు నాగరాజు ఇంటికి వెళ్లి దాడి చేశారు. దీంతో శ్రావణి ఫిర్యాదు చేయగా దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 18, 2024

వరంగల్: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News March 18, 2024

మేడారం: జంపన్నవాగులో మునిగి ఒకరి మృతి

image

వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తుడు ఆదివారం జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పోచమ్మ బస్తీకి చెందిన రాజు కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆదివారం మేడారం వచ్చారు. పుణ్యస్నానం కోసం ప్రవాహంలోకి దిగారు. లోతును అంచనా వేయకుండా దిగడంతో మునిగిపోయాడు. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 18, 2024

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

image

ఇవాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు అందించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.

News March 17, 2024

ములుగు జిల్లాలో 144 సెక్షన్- ఎస్పీ

image

ములుగు జిల్లాలో రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ షాపులను సైతం మూసివేయాలని కోరారు. కాగా జిల్లాలో 3,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

News March 17, 2024

జనగామ: మాజీ ఎమ్మెల్యే కుమారుడి రాజీనామా

image

జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించినా సరైన అవకాశం రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో రాజకీయ భవిష్యత్ గురించి వెల్లడిస్తానన్నారు.

News March 17, 2024

జనగామ: పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు

image

పార్లమెంట్ ఎన్నికల ముగిసే వరకు జనగామ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలియజేస్తామని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలతో కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.

News March 17, 2024

ప్రతి సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

image

జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.