Warangal

News May 7, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారంతో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. తేజ రకం మిర్చికి నిన్న క్వింటాకు రూ.17,100 పలకగా, ఈరోజు రూ.16,600కు తగ్గింది. 341 రకం మిర్చి నిన్న రూ.16 వేల ధర పలకగా.. ఈరోజు రూ.13,500 పలికింది. వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్నటిలాగే రూ.14వేలు, 5531 రకం మిర్చి నిన్నటిలాగే రూ.12 వేల ధర వచ్చింది. నిన్న రూ.35,500 పలికిన టమాటా మిర్చి ధర ఈరోజు రూ.32వేలకు పడిపోయింది.

News May 7, 2024

తీన్మార్ మల్లన్నకు బీ-ఫామ్ అందజేసిన సీఎం

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామని, తనను గెలిపించేందుకు పట్టభద్రులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకనై గళం విప్పుతానన్నారు.

News May 7, 2024

జనగామ: బాలుడికి బైక్ ఇచ్చిన యజమానికి జైలు శిక్ష

image

బాలుడికి బైకు ఇచ్చిన యజమానికి జైలు శిక్ష పడిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ఈ నెల 2న నర్మెట్టలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా.. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకి చెందిన 15 ఏళ్ల బాలుడు బైకు నడుపుతూ పట్టుబడ్డాడు. బైకు ఇచ్చిన యజమాని ధరావత్ ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రూ.1000 జరిమానా, 2 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు.

News May 7, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

image

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

News May 7, 2024

వరంగల్: జాగ్రత్తలు తీసుకుంటేనే ఓటు చెల్లుబాటు..!

image

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1,445 తిరస్కరణకు గురయ్యాయి. అందులో నర్సంపేటలో అత్యధికంగా 278 ఉన్నాయి. సరిగా సంతకాలు చేయకపోవడంతో పాటు పలు కారణాలతో చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలకు గాను రేపటి వరకు ఈ ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

News May 7, 2024

కేసముద్రం మార్కెట్‌కు 7 రోజుల సెలవు

image

కేసముద్రం మార్కెట్‌కు ఈ నెల 8 నుంచి 14 వరకు 7 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అమర లింగేశ్వర రావు తెలిపారు.
*8-05-2024 అమావాస్య
*9-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)
*10-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)
*11-05-2024 (వారాంతపు సెలవు)
*12-05-2024 (ఆదివారం)
*13-05-2024 ( ఎంపీ ఎన్నికల సందర్భంగా)
*14-05-2024 (వ్యాపారుల కోరిక మేరకు)

News May 7, 2024

వరంగల్: 18-39 ఏళ్ల వారే కీలకం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో యువ ఓటర్లు కీలకం కానున్నారు. మహబూబాబాద్, వరంగల్ లోక్‌సభ పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,22,871 మంది 18-39 ఏళ్ల వారే. మొత్తం ఓటర్లలో వీరి శాతం 48.34. కాగా మహబూబాబాద్ పరిధిలో 50.33%, వరంగల్‌లో 46.67% మంది ఆ వయస్సు ఉన్న ఓటర్లు ఉన్నారు. దీంతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

News May 7, 2024

వరంగల్: నేడు ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేషన్

image

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఆ పార్టీ ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు నల్గొండలోని లక్ష్మీ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News May 7, 2024

వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: కావ్య

image

వరంగల్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో రాత్రి కడియం కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదని, పనులు చేసి చూపించే పార్టీ అని కడియం కావ్య అన్నారు.

News May 7, 2024

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉంది: కడియం

image

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో నిర్వహించిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీజేపీ ప్రమాదకర ధోరణిని అవలంబిస్తుందని, బీజేపీ దుర్మార్గాలను, ఆకృత్యాలను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కడియం అన్నారు.