Warangal

News March 21, 2024

జనగామ: ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు విద్యార్థుల అస్వస్థత

image

జనగామ మండలం పెంబర్తిలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకులంలో గురువారం ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన గురుకులం సిబ్బంది చంపక్ హిల్స్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై గురుకుల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

News March 21, 2024

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్

image

2024 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ పిఎస్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరిపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం హన్మకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు: HCA అధ్యక్షుడు

image

వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ ల్యాండ్ మార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో HYD క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జాతీయ హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి జగన్ మోహన్ రావును సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. HYDతో పాటు WGL జిల్లాలోను క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేస్తానని అన్నారు.

News March 21, 2024

మల్లూరు గుట్టపై గుప్త నిధుల తవ్వకాలు

image

మంగపేటలోని మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న 10మందిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టపై కొంత కాలంగా అభివృద్ధి పనులు చేస్తున్న ఓ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, పలు గ్రామాలకు చెందిన 10మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2024

వరంగల్ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News March 21, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,500 వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,500 ధర, టమాటా రకం మిర్చికి రూ.34,000 ధర వచ్చింది. కాగా, టమాటా రకం మిర్చి మినహా అన్ని రకాల ధరలు తగ్గాయి.

News March 21, 2024

వరంగల్: 12 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన అటవీ సంపద హరితహారం కార్యక్రమంతో పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ఏటా ఉమ్మడి జిల్లాలో 2 కోట్లకు తగ్గకుండా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంతో సుమారు 12 శాతానికి అటవీ విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఈసారి ఏడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

News March 21, 2024

వరంగల్ పార్లమెంట్ పరిధిలో 18.16 లక్షల ఓటర్లు

image

వరంగల్ పార్లమెంట్ సీటు పరిధిలో 18.16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 8,91,969 మంది పురుషులు, 9,24,250 మంది మహిళలు, థర్డ్ జెండర్లు 395 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

News March 21, 2024

వరంగల్: పత్తి క్వింటా ధర రూ.7,315

image

హమాలీ గుమస్తాల సంఘం విజ్ఞప్తి మేరకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బుధవారం బంద్ ఉండగా ఈరోజు ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. ధర మొన్నటి కంటే రూ.15 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలకగా.. ఈరోజు రూ.7,315 పలికింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 21, 2024

వరంగల్: పాఠశాల దుస్తుల బకాయి నిధుల విడుదల

image

పెండింగులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల కుట్టు కూలీ బకాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టిన దర్జీల ఛార్జీల చెల్లింపు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2,11,932 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.2.11 కోట్లను విడుదల చేసింది.