Warangal

News July 10, 2024

వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,240 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ.7,400 అయినట్లు అధికారులు తెలిపారు. ధరలు పెరగడం కొంత ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ, మరింత పెరగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

News July 10, 2024

బోగత జలపాతంలోకి దిగొద్దు: CI

image

వాజేడు బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులు జలపాతం నీటిలోకి దిగొద్దని వెంకటాపురం సీఐ బండారి కుమార్ తెలిపారు. బొగత జలపాతాన్ని వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌తో కలిసి పరిశీలించారు. వరద ప్రవాహం పరిస్థితి, సందర్శకుల తాకిడి గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు ఎవరూ లోపలికి వెళ్లవద్దని, వీక్షకులను లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలని అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బందికి సూచించారు.

News July 10, 2024

WGL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ పట్టణ కేంద్రంలోని లేబర్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన చేరాలు(45).. భార్య స్వప్నను(40) సోమవారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపి పోలీసులకు పట్టుబడతాననే భయంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 10, 2024

కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్లు మంజూరు

image

కాకతీయ విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం “రాష్ట్రీయ ఉచ్చితర్ శిక్షా అభియాన్ (రుసా-RUSA) రాష్ట్ర ప్రభుత్వం తరుఫున 60:40 నిష్పత్తిలో రూ.50 కోట్లు 2020లో మంజూరు చేశారు. ఇందులో గతంలో రూ.15 కోట్లు విశ్వవిద్యాలయంలోని K-Hub భవన నిర్మాణం, వసతుల కొరకు విడుదల చేసారు. ప్రస్తుతం మిగతా రూ.35 కోట్లు పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం ఉత్తర్వులను విడుదల చేసింది.

News July 10, 2024

జనగామ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

గడ్డి మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నమిలిగొండలో జరిగింది. SI నాగరాజు వివరాల ప్రకారం.. స్టే.ఘ. మండలం నమిలిగొండకు చెందిన బాలిక(16)ను తల్లిదండ్రులు కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ మొదటి సం.లో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేదని బాలిక పలుమార్లు చెప్పడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఈనెల 7న గడ్డి మందు తాగగా.. ఎంజీఎంలో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందింది.

News July 10, 2024

WGL: మహానగరపాలక సంస్థల ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం

image

గ్రేటర్ వరంగల్ సాధారణ పరిపాలన ప్రజారోగ్యం అర్బన్ మలేరియా గణాంక విభాగాల ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధమైంది. బదిలీలపై ఈనెల 12లోగా ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వాలని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు వరంగల్ ప్రాంతీయ ఉపసంచాలకులు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20లోగా బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.

News July 10, 2024

వరంగల్ నగరవాసులకు ఏసీపీ హెచ్చరిక

image

వరంగల్ నగరంలో ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో రాత్రి 11.50 నిమిషాల ప్రాంతంలో కొంతమంది యువకులు రోడ్డుపై వెళ్తుండగా వారిని ఆపి ఏసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి రోడ్లపై మీకు ఏం పని అంటూ.. వివరాలు ఆరా తీశారు. మరోసారి రాత్రి పూట రోడ్లపై కనిపిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

News July 9, 2024

జనగామ: ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

image

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ పంచాయతీ కార్యదర్శి పట్టుబడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో కార్యదర్శిని సంప్రదించారు. ఈ క్రమంలో కార్యదర్శి లంచం డిమాండ్ చేశారు. నేడు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నారు.

News July 9, 2024

పద్మాక్షి అమ్మవారికి పదివేల గాజులతో ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు నాలుగవ రోజు అమ్మవారికి 10,008 గాజులతో, వివిధ రకాల పూలతో, కూరగాయలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

News July 9, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ఛైర్మన్ పదవులు

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 కార్పొరేషన్లకు ప్రభుత్వం సోమవారం ఛైర్మన్లను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు కార్పొరేషన్ ఛైర్మన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా నుంచి కుడా ఛైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా పొదెం వీరయ్య, అయిత ప్రకాశ్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, మహమ్మద్ రియాజ్, బెల్లయ్యనాయక్‌లకు అవకాశం దక్కింది.