Warangal

News September 13, 2024

వరంగల్: ఎట్టకేలకు భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర ఊరటనిచ్చింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు పత్తి అధిక ధర పలికింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలలో క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా బుధవారం రూ.7,800, గురువారం రూ.7,790కి చేరింది. కాగా, నేడు రూ.7,940 ధర రికార్డు స్థాయిలో పలికింది.

News September 13, 2024

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన దీప్తి

image

ప్యారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాంజి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంస్య పథకం సాధించిన దీప్తిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

News September 13, 2024

ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు

image

వరంగల్లోని ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. ఈనెల 14న శనివారం వారాంతపు యార్డు బందు, 15న ఆదివారం కాగా, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబీకి సెలవు ఉందన్నారు. తిరిగి 18న మార్కెట్ పున:ప్రారంభం అవుతుందన్నారు.

News September 13, 2024

ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ KUDA అధికారులను ఆదేశించారు.

News September 12, 2024

BREAKING.. BHPL: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రవీందర్(35) రేగొండ నుంచి కొత్తపల్లికి బైకుపై వెళ్తుండగా భూపాలపల్లి నుంచి వస్తున్న RTC బస్సు ఢీకొట్టింది. దీంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 12, 2024

వర్గీకరణ అమలు అధ్యయన కమిటీలో సభ్యురాలిగా సీతక్క

image

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా ములుగు జిల్లాకు చెందిన సీతక్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.

News September 12, 2024

మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ

image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల MLAలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ MP కడియం కావ్య సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ మాజీ సభ్యుడిగా సీతారాం ప్రజల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని ఎంపీ వివరించారు. ఏచూరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వారు చెప్పారు.

News September 12, 2024

మైనింగ్ కార్పొరేషన్ అధికారులతో హుస్సేన్ నాయక్ సమావేశం

image

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈరోజు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ఆయన మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్డ్ తెగల సమస్యలపై సమావేశం నిర్వహించి, పలు కీలక విషయాల గురించి చర్చించారు. ఆయనకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

News September 12, 2024

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)ను భద్రపరిచిన గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు.

News September 12, 2024

భద్రకాళి ఆలయంలో రూ.1,05,000లకు వేలం టెండర్

image

వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో 5నెలలు (1-4-2024 నుంచి 10-9-2024) వరకు భక్తులు అమ్మవారికి సమర్పించిన 65 క్వింటాళ్ల ఒడి బియ్యంను బుధవారం బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ బహిరంగ వేలంలో ముగ్గురు పాటదారులు పాల్గొనగా రూ.1,05,000కు రమేశ్ హెచ్చు పాటదారుగా టెండర్ పొందారన్నారు. ఈ బహిరంగ వేలం దేవాదాయ శాఖ పరిశీలకుడు సంజీవరెడ్డి, ఈఓ శేషు భారతి, తదితరులున్నారన్నారు.