News July 28, 2024
NLG: బొమ్మలు చూసి ప్రయాణికుల పరుగు

NLGలోని సావర్కర్ నగర్ చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు పైవంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వస్త్ర దుకాణాల్లో అలంకారానికి వాడే బొమ్మలను పడేశారు. రాత్రి సమయంలో తెల్లగా మనుషులను పోలి ఉన్న వాటిని చూసి స్థానికులు భయపడుతున్నారు. రైలు దిగి వస్తున్న సమయంలో ఆ బొమ్మలను చూసి భయంతో పరుగులు తీశామని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఈ దారిలో చెత్తాచెదారం వేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News November 3, 2025
NLG: కలిసిరాని ‘ఖరీఫ్’

జిల్లా రైతులకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తరువాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షలు కోలుకోలేని దెబ్బ తీశాయి. జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
News November 2, 2025
NLG: తిప్పర్తిలో ముందస్తు జనగణన షురూ!

తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తిప్పర్తి రైతు వేదికలో 3 రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
News November 2, 2025
నల్గొండ: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు పొడిగింపు

నల్గొండ శివారు రాంనగర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్ లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 వరకు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


