News July 4, 2024

నేడు ప్రధాని మోదీతో CM రేవంత్‌ భేటీ!

image

TG: CM రేవంత్‌ ఈరోజు మ.1.30 గంటలకు PM మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను సైతం కలిసే అవకాశముంది. త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో CM ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు. కాగా సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం.

News July 4, 2024

పోలీసులుగా మహిళా కార్యదర్శులు.. విచారణ వాయిదా

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణిస్తూ గత ప్రభుత్వం తెచ్చిన చట్టంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై కొత్త ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా పురోగతి ఉంటే తెలపాలని పిటిషనర్లు, ప్రతివాదులకు సూచించింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను 3వారాలకు వాయిదా వేసింది. ఇప్పటికే తీర్పు రిజర్వు అయినప్పటికీ మళ్లీ విచారించాలని కోర్టు నిర్ణయించింది.

News July 4, 2024

VRAలకు ఊరట.. వివిధ హోదాల్లో సర్దుబాటు

image

TG: సాంకేతిక కారణాలతో ఇప్పటికీ VRAలుగా కొనసాగుతున్న 154 మందికి ప్రభుత్వం ఊరట కలిగించింది. వారిని వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్హతల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ హోదాల్లో సర్దుబాటు చేసి జిల్లాలు, శాఖలను కేటాయించింది. ఈమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

News July 4, 2024

కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు: MP రఘునందన్

image

TG: కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద గౌరవం లేదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా హామీలు అమలు చేయకుండా టైం పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వరికి మద్దతు ధర, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు.

News July 4, 2024

మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ నేడు

image

AP: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నేడు వెలగపూడిలోని సచివాలయంలో తొలిసారి భేటీ కానుంది. ఈ ఉప సంఘానికి హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహిస్తారు. మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మడి సంధ్యారాణి ఇందులో సభ్యులుగా ఉన్నారు.

News July 4, 2024

ప్రజావేదిక కార్యక్రమం వాయిదా

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమం ఈవారం వాయిదా పడింది. అనివార్య కారణాలతో ప్రజావేదికను రద్దు చేసినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు గమనించాలని కోరారు. వినతులు స్వీకరించేందుకు ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

News July 4, 2024

బాసర ట్రిపుల్ ఐటీ: కౌన్సెలింగ్ తేదీలు ఇవే

image

TG: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హులైన వారి జాబితా విడుదలయింది. ఎంపికైన విద్యార్థులకు జులై 8, 9, 10 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మొత్తం 1,404 సీట్లు ఉండగా.. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330, నిజామాబాద్ జిల్లా నుంచి 157 మంది ఎంపికయ్యారు. పూర్తి వివరాలకు https://www.rgukt.ac.in/ సైట్ చూడండి.

News July 4, 2024

రాణించిన ఉతప్ప.. ఇంగ్లండ్ చిత్తు

image

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాబిన్ ఉతప్ప 50 పరుగులతో(32 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. గుర్‌క్రీత్(33), నమన్ ఓజా(25) రాణించగా కెప్టెన్ యువరాజ్(2 రన్స్) నిరాశపర్చారు.

News July 4, 2024

ఎన్నడూ లేనంత బలంగా రష్యాతో బంధం: చైనా

image

రష్యాతో తమ బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పేర్కొన్నారు. కజకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సు సందర్భంగా ఇరువురు దేశాధ్యక్షులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుతిన్‌ను తన పాత స్నేహితుడిగా జిన్‌పింగ్ అభివర్ణించారు. అంతర్జాతీయ పరిస్థితులు కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవాలని ఆయన అభిలషించారు.

News July 4, 2024

ఉద్యోగులకు జీతాలు పెంచారని జైలు శిక్ష

image

ఉద్యోగులకు వేతనాలు పెంచారనే కారణంతో దుకాణ యజమానులను మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ ఇలా జీతాలు పెంచడం సమాజంతో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోందట. వారి వ్యాపారాలను సైతం మూసివేయించి పలువురికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా 2021లో అక్కడి ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది. అప్పటి నుంచి దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.