News July 1, 2024

విషాదం.. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

image

TG: నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లి పద్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో తండ్రికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News July 1, 2024

రోహిత్ వారసుడెవరో?

image

టీ20WCలో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన రోహిత్ ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో సారథిగా ఆయన వారసుడెవరనే చర్చ నెలకొంది. హార్దిక్, సూర్య, బుమ్రా వంటి పేర్లు ప్రస్తావనకు వస్తున్నా జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జింబాబ్వే టూర్‌కు గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినా అది తాత్కాలికమేనని తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్ వచ్చాకే సారథిని ఎంపిక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

News July 1, 2024

అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు

image

న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమలు అవుతాయి. వీటిలో జీరో ఎఫ్ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్‌ మోడ్ ద్వారా సమన్ల జారీ వంటి నిబంధనలున్నాయి.

News July 1, 2024

బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్‌లో పడొద్దు: ఎమ్మెల్సీ వెంకట్

image

TG: గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని MLC బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్‌లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.

News July 1, 2024

జార్జియాను చిత్తు చేసిన స్పెయిన్

image

యూరో ఛాంపియన్ షిప్-2024 రౌండ్ ఆఫ్ 16లో జార్జియాను స్పెయిన్ జట్టు 4-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు చెరో గోల్ చేయగా, రెండో భాగంలో స్పెయిన్ ఆటగాళ్లు రెచ్చిపోయి మూడు గోల్స్ చేశారు. దీంతో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచులో స్లోవెకియాపై ఇంగ్లండ్ 2-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది.

News July 1, 2024

ఇంద్రకీలాద్రిపై 6 నుంచి వారాహి నవరాత్రులు

image

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని ఈవో రామారావు తెలిపారు. లోక కళ్యాణార్థం పండితుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యం చండీపారాయణ, రుద్రపారాయణలు, ఉదయం, సాయంత్రం పూజాహారతి, మంత్రపుష్పాలు నివేదన చేస్తారన్నారు. 15న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.

News July 1, 2024

డిగ్రీ అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్

image

AP: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నేడు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో 3.20 లక్షల వరకు సీట్లుండగా ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయనున్నారు. కాగా ఈసారి బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు అఖిల భారత విద్యామండలి(ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. దీంతో చాలా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి పర్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్లకు జాప్యం జరిగింది.

News July 1, 2024

పాలిటెక్నిక్ కాలేజీల్లో మొదటి విడత సీట్ల కేటాయింపు

image

TG: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యాసంవత్సరానికి గానూ మొదటి విడత సీట్లను కేటాయించారు. ప్రభుత్వ కళాశాలల్లో 11,583, ప్రైవేటు కాలేజీల్లో 9,307 సీట్లను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 8,041 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 13 నుంచి 16 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జులై 18 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

News July 1, 2024

నేటి నుంచి వింబుల్డన్

image

ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి ఫేవరెట్‌గా సెర్బియా ప్లేయర్ జకోవిచ్ ఉన్నారు. ఆయనకు టాప్ సీడ్ సినర్, మూడో ర్యాంకర్ అల్కరాస్ నుంచి పోటీ నెలకొంది. మరోవైపు గాయం కారణంగా నాదల్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల సింగిల్స్‌లో స్వైటెక్, సబలెంక, సకారి టైటిల్ రేసులో ఉన్నారు. భారత్ ప్లేయర్ సుమిత్ తొలి రౌండ్‌లో సెర్బియా ఆటగాడు కెక్‌మనోవిచ్‌తో తలపడనున్నారు.

News July 1, 2024

డిప్యూటీ తహశీల్దార్ల చేతికి ధరణి రిజిస్ట్రేషన్లు?

image

TG: భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక సంస్కరణలు తేనున్నట్లు తెలుస్తోంది. ధరణి రిజిస్ట్రేషన్ల బాధ్యతలతో తహశీల్దార్ల సమయమంతా అక్కడే గడిచిపోతోంది. దీంతో ఆ బాధ్యతల్ని డిప్యూటీ తహశీల్దార్లకు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. తహశీల్దార్లకు కార్యాలయ నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం వంటి ఇతర విధులు ఇవ్వాలని భావిస్తోందట. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.