News June 29, 2024

మొబైల్ నంబర్ పోర్టింగ్.. జులై 1 నుంచి కొత్త రూల్

image

సిమ్ స్వాప్ లేదా మార్పిడి తర్వాత మొబైల్ నంబర్ పోర్టింగ్‌‌ సమయాన్ని ట్రాయ్ వారం రోజులకు కుదించింది. ఈ నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. గతంలో ఇది 10 రోజులుగా ఉండేది. ఇకపై 7 రోజుల్లోగా నంబర్ మార్చుకునేందుకు UPC కేటాయించనుంది. సుదీర్ఘ నిరీక్షణ వల్ల యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని 2-3 రోజులకు తగ్గించాలనే వినతులూ వస్తున్నాయి.

News June 29, 2024

జియో, ఎయిర్‌టెల్ యూజర్లపై ₹47వేలకోట్ల భారం!

image

టారిఫ్ పెంపుతో జియో, ఎయిర్‌టెల్ యూజర్లపై ఏటా ₹47,500కోట్ల భారం పడనుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5జీ సేవలు కావాలనుకునే వారిపై ఈ భారం మరింత ఎక్కువ ఉండనుందని తెలిపారు. జియోలో ₹239 (1.5GB/డే)గా ఉన్న 5జీ మినిమమ్ రీఛార్జ్ అమౌంట్‌ను 46% పెంచి ₹349 (2GB/డే)కు చేర్చింది. ఎయిర్‌టెల్‌ ఏకంగా 71% పెంచింది. ₹239 (1.5GB/డే) ప్యాక్‌ను ₹409 (2.5GB/డే)కు పెంచింది.

News June 29, 2024

రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతాం: మంత్రి నాదెండ్ల

image

AP: రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై ఆయన రెండో రోజు సమీక్ష నిర్వహించారు. ‘కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరకులు వెళ్తున్నాయి. రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతాం. కాకినాడలో తొలిరోజు తనిఖీల్లో ఆరు గోదాముల్లో 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

News June 29, 2024

DS జనసేన ఎదుగుదలను ఆకాంక్షించారు: పవన్

image

మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మృతి పట్ల పవన్ కళ్యాణ్, కేసీఆర్, జగన్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్ బలంగా తన వాదం వినిపించారని పవన్ తెలిపారు. రెండు మూడు సందర్భాల్లో ఆయనను కలిశానని, జనసేన ఎదుగుదలను ఆకాంక్షించారని చెప్పారు. తన తండ్రితో DSకు ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని జగన్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.

News June 29, 2024

BSNLకు మారుతున్నారా?

image

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. అత్యధికంగా జియో 27% టారిఫ్స్ పెంచింది. AirTel, వొడాఫోన్ ఐడియా సైతం కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. దీంతో చాలా మంది ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNLకు షిఫ్ట్ అవుతున్నట్లు పోస్టులు చేస్తున్నారు. మిగతా కంపెనీలతో పోలిస్తే BSNLలో రీఛార్జ్ ధరలు తక్కువ. అయితే BSNL 4G సేవలు ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీది ఏ నెట్‌వర్కో కామెంట్ చేయండి.

News June 29, 2024

రీఛార్జ్ ధరలు ఎందుకు పెరిగాయంటే?

image

జియోతో మొదలై ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టారిఫ్‌లు పెంచడంతో యూజర్లకు రీఛార్జ్ భారంగా మారింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకునేందుకే సంస్థలు టారిఫ్‌ను పెంచాయి. FY24 క్యూ4లో ఎయిర్‌టెల్ ARPU ₹209, జియో ₹181.7, Vi ₹146గా ఉంది. ఈ సగటు FY27కి ₹300కు పెంచుకోవాలని ఎయిర్‌టెల్ ఆశిస్తోంది. 5జీ సేవలను మానిటైజ్ చేసుకునేందుకు కూడా టారిఫ్‌లు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

News June 29, 2024

వారిని ఇంట్లోనే తాగమని చెప్పండి: మంత్రి

image

పురుషులతో మద్యం అలవాటు మాన్పించడానికి మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ సింగ్ మహిళలకు చెప్పిన సూచన చర్చనీయాంశంగా మారింది. ‘మీ ఇంట్లోని పురుషులకు బయట మద్యం తాగొద్దని చెప్పండి. ఇంటికే తెచ్చుకొని తాగమనండి. అప్పుడు వారు మహిళలు, పిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు. క్రమంగా అలవాటు మానుకుంటారు’ అని ఓ సభలో మహిళలకు సూచించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ‘ఇది గృహ హింసకు దారితీస్తుంది’ అని మండిపడింది.

News June 29, 2024

ఇవాళ్టి గోల్డ్ రేట్స్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేట్ రూ.120 పెరిగి రూ.72,280గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.100 పెరిగి రూ.66,250కి చేరింది. అటు కేజీ వెండి ధర రూ.94,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News June 29, 2024

రోహిత్ శర్మ వ్యాఖ్యలకు ఇంజమామ్ కౌంటర్

image

బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేసేవారు కాస్త బ్రెయిన్ వాడాలంటూ రోహిత్ శర్మ చేసిన <<13517621>>వ్యాఖ్యలపై<<>> ఇంజమామ్ తీవ్రంగా స్పందించారు. ‘రివర్స్ స్వింగ్ అంటే ఏంటో మాకు చెప్పొద్దు. అదెలా వేయాలో క్రికెట్ ప్రపంచానికి నేర్పిందే మేము. కండిషన్స్ గురించి మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అంపైర్లు కళ్లు తెరవాలని మాత్రమే నేను చెబుతున్నాను. వారు బ్రెయిన్ వాడితే ఏ సమస్య ఉండదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

News June 29, 2024

‘కల్కి’ అద్భుతం: రజనీకాంత్

image

‘కల్కి’ సినిమాను చూసినట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ X వేదికగా తెలిపారు. మూవీ ఎంతో అద్భుతంగా ఉందని, ఇండియన్ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లారని ప్రశంసించారు. చిత్రం భారీ విజయం పొందిన నేపథ్యంలో నిర్మాత అశ్వనీదత్, బిగ్ బీ అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణెతో పాటు చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. సెకండ్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.