News June 26, 2024

ఓం బిర్లా ఎన్నిక లాంఛన ప్రాయమే

image

లోక్‌సభ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నిక లాంఛన ప్రాయంగా మారింది. స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు కావాల్సిన సభ్యుల మద్దతు(293) ఆయనకు ఉంది. అటు స్పీకర్‌ అయ్యేందుకు ఇండియా కూటమి అభ్యర్థి సురేశ్‌కు ఉన్న మద్దతు చాలదు. ఇదిలా ఉంటే సభ్యులకు సభలో ఇంకా సీట్లు కేటాయించకపోవడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సాధ్యం కాదు. సో సభ్యులకు స్లిప్స్ ఇచ్చి, మాన్యువల్‌గా ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

News June 26, 2024

వీరందరికీ రైతు భరోసా కట్?

image

TG: రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రైతుభరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తోంది.

News June 26, 2024

రికార్డు ధర పలికిన వర్జీనియా పొగాకు

image

TG: వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. జంగారెడ్డిగూడెం కేంద్రంలో కిలో పొగాకు రూ.352 రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేళ్లు రాగా 731 బేళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 27న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా రూ.341 పలికింది.

News June 26, 2024

పెంపుడు కుక్క కాటు.. తండ్రీకొడుకు మృతి

image

పెంపుడు కుక్క కరవడంతో తండ్రీకుమారుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. నరసింగరావు (59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్‌ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించారు.

News June 26, 2024

బంగ్లాదేశ్ చెత్త రికార్డు!

image

T20WC చరిత్రలో బంగ్లాదేశ్ ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటివరకు అన్ని వరల్డ్ కప్‌లు ఆడి ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు చేరని జట్టుగా బంగ్లా మిగిలిపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది T20WCలలో టాప్10లో ఉన్న ఇతర 9 జట్లు సెమీస్ చేరాయి. IND, ENG, AUS, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఏదో ఒక WCలో సెమీస్ చేరాయి. కానీ బంగ్లాదేశ్ సెమీస్‌లో అడుగు పెట్టలేదు.

News June 26, 2024

జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్

image

TG: ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూడా(జూనియర్ డాక్టర్లు)లు ప్రకటించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామంది. ఈ మేరకు నేడు రెండు జీవోలు విడుదల చేస్తామని చెప్పింది. కాగా జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని జూడాలు హెచ్చరించారు.

News June 26, 2024

భూముల విలువ 20%-40% శాతం పెంపు?

image

TG: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ 20% నుంచి 40% పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై అధ్యయనం పూర్తి చేసిన అధికారులు రిజిస్ట్రేషన్ల శాఖకు నివేదికలు అందించారు. దీనిపై ఆ శాఖ సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మార్కెట్ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని సమచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాలతో పెంపు అంశం వాయిదా పడొచ్చనే అభిప్రాయాలున్నాయి.

News June 26, 2024

గెలవమని తెలిసినా కాంగ్రెస్ పోటీ.. ఎందుకంటే?

image

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో గెలిచేందుకు కావాల్సిన మద్దతు తమకు లేదని తెలిసినా కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థిని నిలిపింది. అయితే గెలుపోటములు ముఖ్యం కాదని, సభ సంప్రదాయాన్ని గుర్తు చేయడానికే పోటీలో ఉన్నామని అంటోంది. గత 2 పర్యాయాల్లో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చినా ఎందుకివ్వరని ప్రశ్నిస్తోంది. ఆనవాయితీ ప్రకారం 10% సీట్లు పొందిన తమకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలంటోంది.

News June 26, 2024

నేడు తెలంగాణలో స్కూళ్ల బంద్

image

తెలంగాణలో నేడు స్కూళ్లు మూతబడనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ABVP రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల మూసివేతపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

News June 26, 2024

సీఎంసీవో పత్రాల జారీ పునరుద్ధరణ

image

AP: సీఎం క్యాంపు ఆఫీస్(CMCO) పేరుతో ఆరోగ్య శ్రీ కార్డు లేని వారికి ఇచ్చే అనుమతి పత్రాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఎన్నికల కోడ్ కారణంగా వీటిని ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వాటిని పునరుద్ధరిస్తూ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ కార్డు లేని వారు ఈ పత్రాలతో స్కీమ్ అనుబంధ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు. కలెక్టర్ ఆమోదంతో ట్రస్ట్ అధికారులు ఈ పత్రాలను జారీ చేస్తారు.