News June 22, 2024

విదేశీ విద్యకు అబ్దుల్ కలాం పేరు పెడతాం: మంత్రి ఫరూక్

image

AP: విదేశీ విద్య పథకానికి మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడతామని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని, హజ్ యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. PM జనవికాస్(2014-19)కింద మంజూరైన రూ.643.54 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.

News June 22, 2024

నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

AP: ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను సమావేశంలో ఎన్నుకునే అవకాశముంది. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 16 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం.

News June 22, 2024

రుషికొండ ప్యాలెస్ నాకివ్వండి: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

image

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను తనకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లిస్తానని, లీజుకైనా ఇవ్వాలని ఆయన కోరారు. తన లేఖను కొనుగోలు ఒప్పందంగా పరిగణించాలని తెలిపారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు. కాగా జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

News June 22, 2024

జులై 6 నుంచి సీపీగెట్

image

TG: ఎంఏ, ఎంకాం, MSc, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు జులై 6 నుంచి 15 వరకు సీపీగెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 సబ్జెక్టులకు రోజుకు 3 విడతల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, MSc ఎలక్ట్రానిక్స్‌కు పరీక్షలు ఉండవన్నారు. అభ్యర్థులు జులై 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

News June 22, 2024

నేడు స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతలు స్వీకరణ

image

AP: అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై నేడు సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆయన సభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో టీడీపీ అవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా, ఏడుసార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది.

News June 22, 2024

మధ్యప్రదేశ్‌కు ఆడేందుకు ‘నో’ చెప్పిన విహారి

image

దేశవాళీ మ్యాచుల్లో మధ్యప్రదేశ్ తరఫున ఆడేందుకు భారత క్రికెటర్ హనుమ విహారి నో చెప్పారు. కోచ్ చంద్రకాంత్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి క్యాంపును వీడారు. గతంలో ACAతో వివాదం నెలకొనగా MP తరఫున ఆడాలని విహారి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా తన డెసిషన్‌ను మార్చుకున్నారు. దీనిపై కోచ్ పండిత్ అసహనం వ్యక్తం చేశారు. కాగా విహారి తిరిగి ఆంధ్రా జట్టుతో చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

News June 22, 2024

డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?

image

TG: డీఎస్సీకి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారంతో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. వచ్చే నెల 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

News June 22, 2024

బిల్ గేట్స్ హెల్త్ సీక్రెట్ ఇదే..

image

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్ ఓ పాడ్ కాస్ట్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటానన్నారు. పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని యువ వ్యాపారవేత్తలకు సూచించారు. దీంతో శరీరంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ముందుగానే గుర్తించే వీలుంటుందన్నారు. రోజుకు 7-8 గంటలు నిద్ర పోవాలని తెలిపారు.

News June 22, 2024

కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్

image

TS: కేసీఆర్ సీఎంగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని <<13485306>>KTR<<>>కు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజల మాటలను BRS పట్టించుకోలేదని ఆయన ట్వీట్ చేశారు. ORR, సింగరేణిని అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బొగ్గు గనులను కాపాడి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.

News June 22, 2024

పోలాండ్‌పై ఆస్ట్రియా ఘన విజయం

image

యూరో ఛాంపియన్‌షిప్ 2024లో పోలాండ్‌కు ఆస్ట్రియా షాకిచ్చింది. 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, ద్వితీయార్థంలో ఆస్ట్రియా ప్లేయర్లు రెచ్చిపోయి మరో రెండు గోల్స్ చేశారు. మరోవైపు స్లొవేకియాతో జరిగిన మ్యాచులో ఉక్రెయిన్ 2-1తో గెలుపొందింది. ఇక టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.