News June 19, 2024

రేపు అమరావతిలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటనను ప్రారంభించనున్నారు. రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు.

News June 19, 2024

ఆ నిధులు ఎటు మళ్లించారో తేలుస్తాం: మంత్రి

image

AP: గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన రూ.3,070 కోట్ల నిధులను గత వైసీపీ ప్రభుత్వం మళ్లించిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. ‘మొత్తం 26 లక్షల ఇళ్లలో కేవలం 6లక్షల ఇళ్లే నిర్మించారు. ఇళ్ల లబ్ధిదారులకు రూ.945 కోట్ల మేర బిల్లులు ఎగ్గొట్టారు. కేంద్ర నిధులను మళ్లించడమే కాక రాష్ట్ర వాటా కూడా ఇవ్వలేదు. మళ్లించిన నిధులు రుషికొండ ప్యాలెస్‌కు తరలించారా? లేదా ఇతర అంశాలకా? అనేది తేలుస్తాం’ అని హెచ్చరించారు.

News June 19, 2024

జులై 3 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జులై 3 వరకు పొడిగించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అక్రమాల గురించి మరింత క్షుణ్నంగా విచారించేందుకు ఆయన కస్టడీని పొడిగించాలని ED కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనతో పాటు మరో నిందితుడు వినోద్ చౌహాన్ కస్టడీని సైతం జులై 3వరకు పొడిగించింది.

News June 19, 2024

తైవాన్‌కు అమెరికా సాయుధ డ్రోన్లు

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు చుక్కలు చూపించిన కొన్ని ఆయుధాలు తైవాన్ దేశానికి అందనున్నాయి. వీటిని అమెరికా తైవాన్ దేశానికి విక్రయించనుంది. ఈ డీల్ మొత్తం వాల్యూ 60 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా 720 స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, ఫైర్ కంట్రోల్ వ్యవస్థ, 291 ఆల్టియూస్ 600ఎం లాయిటరింగ్ ఆయుధాలను అందించనుంది. కాగా తైవాన్‌ను ఆక్రమించుకోవాలనే దురాలోచనలో ఉన్న చైనాకు అమెరికా చర్య మింగుడుపడటం లేదు.

News June 19, 2024

నేను పార్టీ మారడం లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

image

TG: తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని మండిపడ్డారు. కాగా కృష్ణమోహన్ రెడ్డితో పాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు రావడంతో ఆయన స్పందించినట్లు తెలుస్తోంది.

News June 19, 2024

మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం.. సర్వీస్ నుంచి తొలగింపు

image

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవాని సేన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళా కానిస్టేబుల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆ ఎస్సైని డిస్మిస్ చేయడంతో పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్టికల్ 311 ప్రకారం అతడిని సర్వీస్ నుంచి తొలగించారు.

News June 19, 2024

ఫలితాల తర్వాత రాణిస్తున్న సూచీలు.. మోదీ అంచనా నిజమైందా?

image

జూన్ 4న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెల్లడైనా అది స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఓవైపు ఒడుదొడుకులు ఎదురవుతున్నా వాటిని దీటుగా ఎదుర్కొంటూ ఈనెల 4 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ 5,222 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.42.4లక్షల కోట్లు పెరిగి రూ.437.24 లక్షల కోట్లకు చేరింది. దీంతో మోదీ అంచనా నిజమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

News June 19, 2024

వాగ్దానం అమలుకు తొలి అడుగు: జనసేన శతఘ్ని

image

AP: ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ DCM పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. ఈక్రమంలో ఎన్నికల హామీల్లో ఓ వాగ్దానం అమలుకు తొలి అడుగు పడిందని ‘జనసేన శతఘ్ని’ ట్వీట్ చేసింది. వ్యవసాయంలో ఉన్నవారంతా లబ్ధి పొందేలా వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకం కిందకు తీసుకొస్తామని జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

News June 19, 2024

ప్రజ్వల్ కస్టడీ జూన్ 24కు పొడిగింపు

image

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీని కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు పొడిగించింది. అత్యాచార కేసులో నిందితుడైన రేవణ్ణ ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్నారు. గతంలో ఆయనకు జూన్ 18 వరకు కస్టడీ విధించిన కోర్టు తాజాగా పొడిగించింది. పలువురు మహిళలపై అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను చిత్రీకరించారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్న విషయం తెలిసిందే.

News June 19, 2024

జగన్ అసెంబ్లీకి రావాలి: మంత్రి పయ్యావుల

image

AP: శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్ల ఫైలుపై తన తొలి సంతకం చేశారు. ‘ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనేలా సమావేశాలు నిర్వహిస్తాం. జగన్ సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా మేమే. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధం’ అని వెల్లడించారు.