News September 2, 2024

హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్

image

TG: వర్షాలు, వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని GHMC అలర్ట్ మెసేజులు పంపుతోంది. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను హెచ్చరించింది. అత్యవసరమైతే 040 21111111 లేదా 9000113667కు కాల్ చేయాలని సూచించింది. మాన్సూన్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

News September 2, 2024

నీటమునిగిన హోంమంత్రి నివాసం

image

AP: విజయవాడలోని హోంమంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో తన పిల్లలను ఓ ట్రాక్టర్‌లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి నివాసం ఉండే కాలనీ అంతా జలదిగ్బంధం అయింది. కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి అనిత సహాయక చర్యలు చేపడుతున్నారు.

News September 2, 2024

తీవ్ర అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాబోయే 5 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నిన్న కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం ద.ఒడిశా, ద.ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోందని, రాబోయే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందని తెలిపింది. కాగా నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA పేర్కొంది.

News September 2, 2024

మునిగిన కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ.. రూ.70 కోట్ల నష్టం

image

AP: భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా విజయవాడ కొత్తపేటలో ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఫ్యాక్టరీ మునిగిపోయింది. 2 రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో ఫ్రిజ్‌లన్నీ నిలిచిపోయాయి. అందులోని పాలు, పాల పదార్థాలు పాడైపోవడంతో రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సంస్థ ఎండీ ఈశ్వరరావు తెలిపారు.

News September 2, 2024

విజయవాడ మునకకు కారణం ఇదే!

image

AP: ఎన్నడూ లేనంత భారీ వర్షాలకు విజయవాడ మునిగిపోయింది. ఒకప్పుడు వాన నీరు ప్రవహించే బుడమేరు కాలువ నగరీకరణ కారణంగా మురికినీరు, చెత్తాచెదారంతో నిండిపోయింది. పైగా నగరంలోని అవుట్‌ఫాల్ డ్రెయిన్లు బుడమేరులోనే కలుస్తున్నాయి. ఊహించని రీతిలో వరద రావడంతో ఆ కాల్వ ఉప్పొంగిపోయింది. దీంతో విజయవాడ జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది.

News September 2, 2024

తెలంగాణలో వర్షపాతం వివరాలు

image

TG: నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న ఉ.8.30 నుంచి ఈరోజు ఉ.6 వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
1.కామారెడ్డిలో 25.43 సెం.మీ
2.తూంపల్లి (నిజామాబాద్)- 22.1 సెం.మీ
3.గాంధారి (కామారెడ్డి)- 18.6 సెం.మీ
4.తాడ్వాయి, లింగంపేట (కామారెడ్డి)- 18 సెం.మీ

News September 2, 2024

నేడు సోమవతి అమావాస్య.. ఏం చేయాలి?

image

సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. దీన్ని అమాసోమవార వ్రతం అని పేర్కొంటారు. ఈ అమావాస్య రోజు మౌనవ్రతం పాటిస్తే వెయ్యి గోవులు దానం చేసిన ఫలం లభిస్తుందని గ్రంథాల్లో ఉంది. ఈరోజు రావిచెట్టును పూజిస్తారు. చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు. రావి, వేప చెట్లు కలిసి ఉన్న చోట కోరికలు చెప్పుకుంటూ కొమ్మలకు తోరాలు కడతారు. ఇలా చేస్తే ఎలాంటి కోరికలైనా తీరతాయని నమ్మకం.

News September 2, 2024

వామ్మో.. మరో తుఫాన్ ముప్పు!

image

AP: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగానే ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై రెండు రోజుల్లో కచ్చితమైన సమాచారం వస్తుందని చెబుతున్నారు.

News September 2, 2024

ఈ రోడ్డుపైకి వెళ్లొద్దు..!

image

విజయవాడ, హైదరాబాద్ మధ్య సూర్యాపేట మీదుగా నిన్న మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్ వద్ద పాలేరు నది ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోయింది. దీంతో NH-65పైకి రావొద్దని అధికారులు సూచించారు. వరద తగ్గాక మరమ్మతులు చేపడతామన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు.

News September 2, 2024

GST: APలో తగ్గుదల.. TGలో పెరుగుదల

image

ఆగస్టులో ఏపీ జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.3,479 కోట్లు వసూలవగా, ఈ ఏడాది రూ.3,298 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలో 4 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో రూ.4,393 కోట్లు వసూలవగా, ఈసారి ఆ మొత్తం రూ.4,569 కోట్లకు పెరిగినట్లు ప్రకటించింది.