News November 21, 2024

26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు: APSDMA

image

AP: హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో 23న అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. వరి కోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 21, 2024

BGTలో బుమ్రా కెప్టెన్.. 2021లోనే చెప్పిన నెటిజన్!

image

బిడ్డ పుట్టిన కారణంగా రోహిత్‌ BGT సిరీస్ కోసం ఇంకా ఆస్ట్రేలియా వెళ్లలేదు. దీంతో తొలి మ్యాచ్‌కి బుమ్రా కెప్టెన్ అయ్యారు. ఇదంతా ఈ మధ్య జరిగింది. కానీ ఓ నెటిజన్ 2021 డిసెంబరు 31న దీన్ని అంచనా వేశారు. ‘BGT మ్యాచ్‌కి టాస్ కోసం బుమ్రా, కమిన్స్ కెప్టెన్లుగా వస్తున్నట్లుగా ఊహించుకున్నా’ అని అప్పట్లో ట్వీట్ చేశారు. దాన్ని రీట్వీట్ చేసి ‘తర్వాత ఏం కోరుకోమంటారు?’ అంటూ అడిగిన ట్వీట్ వైరల్ అవుతోంది.

News November 21, 2024

కార్మికుడిగా పనిచేస్తూ NEETలో 677 స్కోర్

image

కోచింగ్ తీసుకుని, 18 గంటలు చదివినా కొందరు నీట్ పరీక్ష ఫెయిల్ అవుతుంటారు. కానీ, స్క్రీన్ పగిలిన ఫోన్‌లో చదువుతూ 21 ఏళ్ల కార్మికుడు నీట్‌ను ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్ఫరాజ్ నీట్ యూజీలో 720కి 677 స్కోరుతో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈయన రోజూ 8 గంటలు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే సాయంత్రం చదువుకునేవారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు.

News November 21, 2024

‘గేమ్‌ఛేంజర్’.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది: SJ సూర్య

image

‘గేమ్ ఛేంజర్’ అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని నటుడు SJ సూర్య ట్విటర్లో కొనియాడారు. ‘హాయ్ ఫ్రెండ్స్. కీలక సన్నివేశాలకు సంబంధించి రామ్ చరణ్, శ్రీకాంత్‌తో డబ్బింగ్ పూర్తి చేశాను. 2 సీన్లకే 3రోజులు పట్టింది. అవుట్‌పుట్ చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. థియేటర్లలో ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా రెచ్చిపోతారు. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు‌, వారి బృందాలకు థాంక్స్. సంక్రాంతి మామూలుగా ఉండదు’ అని ట్వీట్ చేశారు.

News November 21, 2024

జొమాటోలో డ్రగ్స్ అమ్మకం.? సంస్థ స్పందన ఇదే

image

జొమాటోలో కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఐటెమ్స్ పేరిట మత్తు పదార్థాల్ని విక్రయిస్తున్నాయన్న ఆరోపణలపై జొమాటో తాజాగా స్పందించింది. ‘అలాంటి రెస్టారెంట్లను గుర్తించి ఇప్పటికే ఓ జాబితాను రూపొందించాం. వాటిని జొమాటో నుంచి తొలగిస్తున్నాం. మా యాప్‌లో రిజిస్టర్ అయ్యే అన్ని సంస్థలకూ FSSAI లైసెన్స్ ఉండాల్సిందే. మద్యం, సిగరెట్లు, వేప్స్ వంటివి విక్రయించేవారిని బ్లాక్ చేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.

News November 21, 2024

టెస్టు సిరీస్‌కు రోహిత్ వచ్చేస్తున్నారు!

image

ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టుకు రోహిత్ శర్మ మిస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు మూడో రోజు సమయానికి ఆయన జట్టుతో జాయిన్ కానున్నారు. ఈ నెల 24కి శర్మ ఆస్ట్రేలియా చేరుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రెండో టెస్టు నుంచీ ఆయన ఆడనున్నారు. బిడ్డ పుట్టిన కారణంగా ఆయన ముంబైలోనే ఉండిపోయారు.

News November 21, 2024

ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని CM చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీస్ శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేశారు.

News November 21, 2024

BGT టెస్ట్: రేపు ఆడే జట్టు ఇదేనా?

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి పెర్త్‌లో తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ప్రాక్టీస్ సెషన్లను బట్టి తుది జట్టును ఆస్ట్రేలియా మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటి ప్రకారం.. రేపటి తుది జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లీ, పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ , రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్

News November 21, 2024

అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?: కవిత

image

TG: అదానీపై అమెరికాలో కేసు నమోదవడంపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’ అని ట్వీట్ చేశారు.

News November 21, 2024

భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూఆక్రమణలకు పాల్పడ్డారని CM చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం. వాళ్లు ఇక బయట తిరగలేరు’ అని హెచ్చరించారు.