News January 22, 2025

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం

image

AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.

News January 22, 2025

ఏంటీ ‘బర్త్ టూరిజం’?

image

పిల్లలకు US పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి అక్కడికి వెళ్తుంటారు. దీన్నే ‘బర్త్ టూరిజం’ అంటారు. US అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలికారు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా, తాత్కాలిక వీసాపై నివాసం ఉన్నా.. వారికి పుట్టబోయే బిడ్డకు జన్మత: అక్కడి పౌరసత్వం వర్తించదు.

News January 22, 2025

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి

image

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.

News January 22, 2025

తెలుగు రాష్ట్రాల్లో పురుష, మహిళా ఓటర్ల శాతం ఇలా..

image

దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలో 100 మంది పురుషులకు గానూ 103 మంది(100:103) మహిళలు, తెలంగాణలో 100 మంది పురుషులకు 100 మంది మహిళా ఓటర్లు(100:100) ఉన్నట్లు పేర్కొంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా ఈ నిష్పత్తి 100: 109గా ఉంది. అత్యల్పంగా గుజరాత్, హరియాణా, ఢిల్లీలో 100:84గా ఉన్నట్లు తెలిపింది.

News January 22, 2025

రేపటి నుంచి స్లాటెడ్ దర్శన టోకెన్ల జారీ

image

తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రేపటి నుంచి జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. SSD టోకెన్ల జారీపై అధికారులతో TTD EO సమీక్షించారు. ఈ విధానం లేకుండా దర్శనాలు ఎలా జరిగాయి? రద్దు చేస్తే కలిగే పరిణామాలు, క్యూ లైన్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏ రోజుకారోజు టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.

News January 22, 2025

MLAకు గుండెపోటు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

image

TG: గుండెపోటుకు గురైన BRS ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబంతో సహా డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయన 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు స్టంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

News January 22, 2025

GHMC మేయర్‌పై అవిశ్వాసానికి BRS ప్లాన్!

image

TG: GHMCపై రాజకీయంగా పట్టు నిలుపుకునేందుకు BRS వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ నుంచి మేయరై కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాగా ప్రస్తుతం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో కలిసి మొత్తం 198 మంది ఉన్నారు. BRSకు 98 మంది మద్దతు ఉంటేనే అవిశ్వాసానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతిస్తారు. కానీ ఇప్పటి లెక్కల ప్రకారం BRS మద్దతుదారుల సంఖ్య 80కి మించడంలేదని విశ్లేషకుల అంచనా.

News January 22, 2025

వైద్య విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వైద్య విద్యలో PG ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ పీజీ-2024లో క్వాలిఫై అయిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 23న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. కాగా తెలంగాణ బయట ఎంబీబీఎస్ పూర్తి చేసి, 9, 10, ఇంటర్ రాష్ట్రంలో చదివిన వారికే ఈ అవకాశం ఉంది.

News January 22, 2025

66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపిణీ

image

కృష్ణా జలాలు చెరి సగం పంపిణీ చేయాలన్న <<15215783>>తెలంగాణ <<>>ప్రతిపాదనను KRMB అంగీకరించలేదు. దీనిపై త్రిసభ్య కమిటీని నియమించనుంది. పాత ఒప్పందం 66:34 ప్రకారమే నీరు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులను AP వ్యతిరేకించింది. అలాగే నీటి వాడకం లెక్కలూ తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న TG ప్రతిపాదననూ ఒప్పుకోలేదు. అటు ప్రధాన కార్యాలయం HYD నుంచి విజయవాడ తరలించేందుకు KRMB ఆమోదం తెలిపింది.

News January 22, 2025

నేడు అనంతలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్

image

AP: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ నేడు అనంతపురంలో నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న ఈ సభకు హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ హాజరు కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతలో నిర్వహించాలని అనుకున్నా.. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దు చేశారు. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజైన విషయం తెలిసిందే.