News January 16, 2025

కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

News January 16, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

News January 16, 2025

‘ముక్కనుమ’ గురించి తెలుసా?

image

సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు

News January 16, 2025

పౌరులకు మానవతా సాయం అందించండి: యూఎన్ చీఫ్

image

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు UN చీఫ్ అంటోనీ గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ఈజిఫ్టు, ఖతార్, యూఎస్ఏను ఆయన అభినందించారు. బాధిత పౌరులకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొని సాధ్యమయ్యే ప్రతిదీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.

News January 16, 2025

ఇండియా ఓపెన్: ప్రణయ్, లక్ష్యసేన్ ఔట్

image

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, ప్రణయ్ ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక, ఆకర్షి ఓడిపోయారు. మరోవైపు ఇవాళ స్టార్ ప్లేయర్ సింధు జపాన్ క్రీడాకారిణి సుజుతో తలపడనున్నారు. మరో ప్లేయర్ అనుపమ ఉపాధ్యాయ జపాన్‌కు చెందిన మియజాకితో పోటీ పడనున్నారు.

News January 16, 2025

‘పుష్ప-2’ టికెట్ ధరలు తగ్గింపు

image

ఈ నెల 17 నుంచి మరో 20 నిమిషాల అదనపు నిడివితో ‘పుష్ప-2’ ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంతో పాటు నార్త్ ఇండియాలో టికెట్ రేట్లను చిత్ర యూనిట్ తగ్గించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటికే రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది.

News January 16, 2025

కోర్టుల్లో వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలి: SC

image

దేశంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, స్త్రీలు, పురుషుల కోసం వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(SC) ఆదేశించింది. ఇది సౌకర్యానికి సంబంధించినది కాదని కనీస అవసరమని పేర్కొంది. వీటి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వం, స్థానిక అధికారులదని తెలిపింది. కోర్టు ఆవరణల్లో సామాన్యులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News January 16, 2025

నేడు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

News January 16, 2025

ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్

image

ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.

News January 16, 2025

తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి

image

AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.