News July 11, 2024

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది: మోత్కుపల్లి

image

TG: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. ‘నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం వారిని కింద పడేసి కొడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వాన్ని మార్చేసింది నిరుద్యోగులే అనే విషయం మర్చిపోవద్దు. కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. MP ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది’ అని పేర్కొన్నారు.

News July 11, 2024

రూ.7.5 కోట్ల కారు కొన్న రామ్ చరణ్?

image

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త కారులో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే ఖరీదైన కార్లను కలిగి ఉన్న రామ్ చరణ్ ‘Rolls Royce Spectre’ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని విలువ ఏకంగా రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే తండ్రి చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ ఉంది.

News July 11, 2024

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ వి‌ప్‌లు, సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.

News July 11, 2024

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల

image

AP: ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై ఆయన తొలి సంతకం చేశారు. దీంతో స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి.

News July 11, 2024

బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ముద్ర

image

బడ్జెట్ సమావేశాల చరిత్రలో బీజేపీ సర్కార్ తనదైన ముద్రవేసింది. సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టే బ్రిటిష్ సంప్రదాయానికి 1999లో వాజ్‌పేయీ సర్కార్ చెక్ పెట్టింది. ఉదయం 11గం.కు సమావేశాలు మొదలయ్యేలా చేసింది. 2019లో సూట్‌కేసులో బడ్జెట్ తెచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టిన బీజేపీ సర్కార్ 2021లో డిజిటల్ బడ్జెట్‌కు నాంది పలికింది. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాలూ (రెండున్నర గంటలపైనే) బీజేపీ హయాంలోనే నమోదయ్యాయి.

News July 11, 2024

75% హాజరు ఉంటేనే రూ.15,000.. జీవో విడుదల

image

AP: ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు ‘తల్లికి వందనం’గా మార్చింది.

News July 11, 2024

చైనాకు నాటో వార్నింగ్

image

ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు సహకరించడం చైనా మానుకోవాలని నాటో దేశాలు హెచ్చరించాయి. రష్యాకు డ్రాగన్ మిలిటరీ సాయం అందించకున్నా మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించిందని పేర్కొన్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాలను చైనా అందిస్తుండటంతో రష్యాకు ఆయుధాల తయారీ సులభమవుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా సహకారం వల్ల ఐరోపా సహా రష్యా పొరుగు దేశాలకు ముప్పు పెరుగుతోందని తెలిపాయి.

News July 11, 2024

రాజ్‌ తరుణ్-లావణ్య వ్యవహారం.. హీరోయిన్ మాల్వీపై కేసు

image

రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం మలుపులు తిరుగుతోంది. ఆమె ఫిర్యాదుతో నిన్న రాజ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేశారు. రాజ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, మాల్వీకి దగ్గరయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారని ఆరోపించారు. రాజ్, మాల్వీ ‘తిరగబడరా సామి’ మూవీలో నటించారు.

News July 11, 2024

బండి సంజయ్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన CM రేవంత్

image

TG: కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని, ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. అందుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు సైతం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాయి.

News July 11, 2024

నీట్ యూజీ కేసు విచారణ వాయిదా

image

నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన పలువురికి కేంద్రం, NTA అందించిన అఫిడవిట్‌లు అందకపోవడం, వారికి కొంత గడువు అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రశ్నపత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలియజేసింది. మరోవైపు నీట్ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని NTA పేర్కొంటోంది.