News December 29, 2024

రష్యా వల్లే విమానం కూలింది: అజర్ బైజాన్ Prez

image

క‌జ‌కిస్థాన్‌లో త‌మ దేశ విమానం కూలిపోయిన‌ ఘ‌ట‌న వెనుక ర‌ష్యా హ‌స్తం ఉంద‌ని అజ‌ర్ బైజాన్ అధ్య‌క్షుడు ఇల్హామ్ అలియేవ్ ఆరోపించారు. భూత‌ల కాల్పుల వ‌ల్లే దెబ్బతిన్న తమ విమానం కూలిపోయిందన్నారు. రష్యాలోని కొన్ని వర్గాలు ఈ ఘ‌ట‌న వెనకున్న వాస్త‌వాల్ని దాచిపెట్టి త‌ప్పుడు క‌థ‌నాల్ని వ్యాప్తిలోకి తెచ్చాయ‌ని అలియేవ్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న పుతిన్‌, బాధ్య‌త వ‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

News December 29, 2024

రోహిత్ రిటైర్ కావడం మంచిది: ఆసీస్ మాజీ కెప్టెన్

image

టెస్టుల్లో విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక రిటైర్ కావడం మంచిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా అన్నారు. తాను కనుక సెలక్టర్ అయితే మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైతే రోహిత్‌కు ఉద్వాసన పలుకుతానని చెప్పారు. ‘రోహిత్ చివరి 14 ఇన్నింగ్సుల్లో యావరేజ్ 11 మాత్రమే. ఇది ఆయన వైఫల్యానికి నిదర్శనం. ఎవరైనా ఏదో ఒకదశలో కెరీర్ చరమాంకానికి చేరుకోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

News December 29, 2024

విచారణకు పవన్ ఆదేశం.. రంగంలోకి అధికారులు

image

AP: కాకినాడ వాకలపూడి తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. తాబేళ్ల మృతికి గల కారణాలను తెలుసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కాకినాడ తీరంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని PCB అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

News December 29, 2024

6 విమాన ప్ర‌మాదాలు.. 234 మంది మృతి

image

ప్ర‌పంచ ఏవియేష‌న్ రంగానికి డిసెంబర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల‌లో పలు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 234 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. అదివారం ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఒక్క ఘటనలోనే 177 మంది మృతి చెందారు. అంత‌కుముందు అజర్ బైజాన్ విమానం కజకిస్థాన్‌లో అనుమానాస్ప‌ద రీతిలో ప్ర‌మాదానికి గురైన ఉదంతంలో 38 మంది అసువులు బాశారు. మ‌రో 4 చోట్ల 19 మంది మృతి చెందడం సాంకేతిక సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.

News December 29, 2024

రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు

image

AP: నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్రంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని తెలిపారు. అర్ధరాత్రి కేక్ కటింగ్, మద్యం సేవించడం, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం, డీజేలు, బైక్, కార్ రేసులు నిర్వహించకూడదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

News December 29, 2024

నేను జనసేనలో చేరడం లేదు: తమ్మినేని సీతారాం

image

AP: తనకు జనసేనలో చేరాల్సిన అవసరం లేదని YCP నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసకు కొత్త ఇన్‌ఛార్జిని పెట్టడంతో పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

News December 29, 2024

కాంగ్రెస్‌వి చీప్ పాలిటిక్స్‌: బీజేపీ

image

మ‌న్మోహ‌న్ స్మార‌కార్థం స్థ‌లాన్ని కేటాయించ‌కుండా ఆయ‌న్ను అవ‌మానించారంటూ కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని BJP మండిపడింది. అంత్య‌క్రియ‌ల్లో మోదీ, అమిత్ షా కేంద్రంగా మీడియా కవరేజ్ చేశార‌నేది అవాస్త‌వ‌మ‌ని, భ‌ద్ర‌తా సంస్థ‌లు క‌వ‌రేజీపై ఆంక్ష‌లు విధించాయని పేర్కొంది. సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలను ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారం ఫస్ట్ రోలో Ex PM కుటుంబ సభ్యులకు 5 కుర్చీలు కేటాయించారంది.

News December 29, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్

image

TG: సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పండగ తర్వాత ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.

News December 29, 2024

సీఎం యోగి నివాసం కింద శివలింగం: అఖిలేశ్

image

UP CM యోగి ఆదిత్య‌నాథ్ అధికారిక‌ నివాసం కింద శివ‌లింగం ఉంద‌ని SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. త‌మ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని, లింగాన్ని వెలికితీసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సంభ‌ల్‌లో మెట్ల బావి బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం ASI త‌వ్వ‌కాలు చేపట్టడంపై BJPని అఖిలేశ్ త‌ప్పుబ‌ట్టారు. ‘వాళ్లు ఇలాగే త‌వ్వుకుంటూ పోతారు. ఏదో ఒక‌రోజు సొంత ప్ర‌భుత్వానికే గోతులు త‌వ్వుకుంటారు’ అని విమ‌ర్శించారు.

News December 29, 2024

విషాదం.. సుమిత్ కన్నుమూత

image

మధ్యప్రదేశ్ గుణ(D) పిప్లియా గ్రామంలో బోరుబావిలో నిన్న పడిన పదేళ్ల బాలుడు సుమిత్(10) కథ విషాదాంతమైంది. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు బావికి సమీపంలో గొయ్యి తీసి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా చల్లని వాతావరణంలో ఉండటంతో శరీర భాగాలు స్తంభించి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.