News September 21, 2024

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ ఎప్పుడంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ హారర్ కామెడీ మూవీ దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ అక్టోబర్ 23న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది.

News September 21, 2024

ప్రసాదంలో కాదు.. చంద్రబాబులోనే కల్తీ: VSR

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు. కల్తీ అంతా CM చంద్రబాబు బుర్ర, మనసులోనే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘బాబు జీవితంలో ఆరోపణలు తప్ప నిరూపణలు ఉండవు. కలియుగంలో ఆయన చేసిన పాపాలు ఎవరూ చేసి ఉండరు. నీ ప్రవర్తనతో కంసుడు, కీచకుడు సిగ్గు పడేలా చేశావు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు ప్రజల దురదృష్టం. ఆ దేవదేవుడు ఎప్పటికీ నిన్ను క్షమించడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News September 21, 2024

తిరుపతి లడ్డూ వివాదం ఫేక్ కావొచ్చు: TMC ఎంపీ

image

తిరుపతి లడ్డూ వివాదం బీజేపీ వ్యాప్తి చేసిన కల్పితం కావొచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ ఎగ్జిట్ పోల్స్ టైమ్‌లో స్టాక్ మార్కెట్ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. దాంతో హెరిటేజ్ షేర్లపై CBN కుటుంబానికి రూ.1200 కోట్ల లాభం వచ్చింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిపై ఆరోపణలు చేసిన సీఎంకు ఓ డెయిరీ రాజ్యం ఉండటం కాకతాళీయమేనా?’ అని సందేహం వ్యక్తం చేశారు.

News September 21, 2024

లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం

image

AP: లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.

News September 21, 2024

3,445 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

RRB అండర్ గ్రాడ్యుయేట్ కింద 3445(టికెట్ క్లర్క్-2022, టైపిస్ట్-361, జూనియర్ టైపిస్ట్-990, ట్రైన్ క్లర్క్-72) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. SCRలో 89, ECoR 56 పోస్టులున్నాయి. 18-33 ఏళ్లలోపు ఇంటర్ అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.500(CBT పరీక్షకు హాజరైతే రూ.400 రిటర్న్ ఇస్తారు). పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News September 21, 2024

రూ.100 కోట్లు సాధించేందుకు ఆ మూవీకి 20 ఏళ్లు పట్టింది!

image

షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా జంటగా నటించిన ‘వీర్ జారా’ సినిమా 2004లో విడుదలైంది. అప్పట్లో వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.97 కోట్లు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి పలుమార్లు రి-రిలీజ్‌ అవుతూ వచ్చింది. ఈ ఏడాది కూడా 282 థియేటర్లలో మళ్లీ విడుదలై జనాదరణ పొంది జీవిత కాల కలెక్షన్లలో ఎట్టకేలకు రూ. 100 కోట్లు దాటింది. సినిమా మొత్తం గ్రాస్ రూ.101.75 కోట్ల మార్కును దాటిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.

News September 21, 2024

కొత్త సర్వే: మ‌హిళ‌ల నిర్ణ‌యాధికారం పెరిగింది

image

పలు అంశాల్లో మ‌హిళ‌ల నిర్ణ‌యాధికారం, భాగ‌స్వామ్యం పెరిగింద‌ని IIM అహ్మ‌దాబాద్ జెండ‌ర్ సెంట‌ర్ తాజా అధ్య‌య‌నం పేర్కొంది. 705 జిల్లాల్లో జ‌రిపిన స‌ర్వేలో 67.5% జిల్లాల్లో మ‌హిళ‌ల ఆరోగ్యం, గృహ కొనుగోళ్లు, జీవిత భాగ‌స్వామి ఆదాయం ఖ‌ర్చు విష‌యంలో వారి నిర్ణ‌యాధికారం పెరిగిన‌ట్టు తేల్చింది. అలాగే ఒంట‌రిగా లేదా భాగ‌స్వామితో క‌లిసి ఆస్తుల‌ను క‌లిగిన వారు 29% నుంచి 35 శాతానికి చేరిన‌ట్టు తెలిపింది.

News September 21, 2024

ధోనీ రికార్డు సమం చేసిన పంత్

image

టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరో ఘనత సాధించారు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా ఆయన నిలిచారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు పంత్ 6 శతకాలు బాదారు. ఈ క్రమంలో ఆయన ధోనీ (6) రికార్డును సమం చేశారు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధించగా పంత్ 58 ఇన్నింగ్సుల్లోనే సాధించారు. వీరిద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా (3) ఉన్నారు.

News September 21, 2024

జగన్‌కు శ్రీవారి పాపం తగులుతుంది: మంత్రి సవిత

image

AP: తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్‌కు వేంకటేశ్వరస్వామి పాపం తగులుతుందని మంత్రి సవిత అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందించారు. ‘లడ్డూ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందుకు బాధ్యులైన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొవ్వు పట్టిన వ్యక్తులే లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి తయారు చేయించారు’ అని ఆమె మండిపడ్డారు.

News September 21, 2024

పవన్‌ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోశయ్యతోపాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోశయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు.