News March 28, 2024

మాస్కో ఉగ్రదాడిలో 95మంది ఆచూకీ గల్లంతు!

image

గత వారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 140మంది చనిపోగా 182మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. అయితే, అధికారుల జాబితాలో లేని మరో 95మంది ఆచూకీ లభ్యం కావడంలేదని బాజా న్యూస్ ఛానల్ తెలిపింది. ఈ మేరకు తమ శోధనలో తేలిందని పేర్కొంది. తమవారేమయ్యారో తెలియడం లేదంటూ గల్లంతైన వారి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించింది.

News March 28, 2024

జైలు నుంచి పాలన జరగదు: ఢిల్లీ గవర్నర్

image

ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ‘జైలు నుంచి ప్రభుత్వ పాలన జరగదు. ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను’ అని తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

News March 28, 2024

నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

TS: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు.

News March 28, 2024

ఐపీఎల్‌లో నేడు RR vs DC

image

IPLలో భాగంగా ఈరోజు రాత్రి 7.30గంటలకు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. జైపూర్‌లోని RR హోం గ్రౌండ్‌లోనే ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ ఆల్రెడీ ఓ మ్యాచ్ గెలవగా, ఢిల్లీ ఖాతా తెరవాల్సి ఉంది. ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ హోం టీమ్సే గెలిచాయి. ఆ ట్రెండ్‌ను మార్చాలని ఢిల్లీ భావిస్తోంది. ఆ జట్టులో తొలి మ్యాచ్‌కు దూరమైన బౌలర్ ఎన్రిచ్ నోకియా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.

News March 28, 2024

పొత్తు ధర్మం పాటించకపోతే కఠిన చర్యలు: పవన్

image

AP: పొత్తు ధర్మం పాటించి మిత్ర పక్ష కూటమిని గెలిపించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పొత్తు ధర్మం పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంరక్షణ కోసం మిత్రపక్ష కూటమిని గెలిపించుకోవాలి. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలు ముందుకెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News March 28, 2024

సన్‌రైజర్స్‌.. వావ్..!: నారా లోకేశ్

image

SRH సాధించిన అద్భుత విజయం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘వావ్.. ఎన్నో ఐపీఎల్ రికార్డుల్ని సన్‌రైజర్స్ బద్దలుగొట్టారని, 277 స్కోరు చేశారని తెలిసింది. ఎలా ఆడారో హైలైట్స్ చూడాలి. క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్‌.. మీరు ఆడిన ఆటకు అభివాదాలు’ అని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం SRHను అభినందించిన సంగతి తెలిసిందే.

News March 28, 2024

పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు: జైశంకర్

image

సమస్యలకు పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. కౌలాలంపూర్ పర్యటనలో ఉన్న ఆయన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ‘ఈ యుద్ధానికి ఎలాగైనా ముగింపు తీసుకురావాలనే భారత్ భావిస్తోంది. రణంలో విజేతలు ఉండరు. ముగిసేసరికి అమాయకులు కూడా నష్టపోతారు. ఎలాగోలా ఈ యుద్ధాన్ని ఆపాలి. గాజా ఉద్రిక్తతలకూ ఇదే వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు.

News March 28, 2024

మఫాకా పేరిట చెత్త రికార్డు

image

ఐపీఎల్ సీజన్-17 ఆడుతున్న అతి పిన్న వయస్కుడు క్వేనా మఫాకా(17) అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ ముంబై బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డులో మూడో స్థానంలో నిలిచారు. 2018లో బసిల్ థంపీ 70, 2023లో యశ్ దయాల్ 69 పరుగులు సమర్పించుకుని టాప్-2లో ఉన్నారు.

News March 28, 2024

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

image

ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దైంది. దాంతో భర్త పదే పదే ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. ఇటీవల ఇద్దరూ విడిపోయారు. అనంతరం భార్య భర్త తనను హింసించాడంటూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాటలతో, చేష్టలతో వేధించాడని పేర్కొంది. దీంతో సదరు భర్త ఆమెకు ప్రతి నెల రూ.1.50 లక్షల భరణం, సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు గాను రూ.3 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

News March 28, 2024

ఎన్డీఏ నేతల భేటీ

image

AP: టీడీపీ-జనసేన-బీజెపీ ముఖ్య నాయకులు విజయవాడలో నిన్న సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన తరఫున పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం, ఉమ్మడి సభలు, వచ్చే నలభై రోజులు అనుసరించాల్సిన వ్యూహాలు, మేనిఫెస్టో తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.