News May 30, 2024

BREAKING: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

image

జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ను ఆయన ఆదేశించారు. లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. మరోవైపు దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు.

News May 30, 2024

రెండేళ్ల పిల్లాడు గీసిన పెయింటింగ్.. 7వేల డాలర్లకు విక్రయం

image

జర్మనీకి చెందిన లారెంట్ ష్వార్జ్ వయసు రెండేళ్లే. కానీ అతడు వేసే పెయింటింగ్స్ మాత్రం వేలాది డాలర్లకు అమ్ముడుపోతున్నాయి. గత ఏడాది లారెంట్‌లోని కళను గుర్తించిన పేరెంట్స్ అతడి కోసం ప్రత్యేకంగా ఓ ఆర్ట్ స్టూడియోను రూపొందించారు. అతడి పెయింటింగ్స్‌ను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. వాటికి డిమాండ్ పెరగడంతో ఆన్‌లైన్‌‌లో ఇప్పుడు వేలాది డాలర్లకు విక్రయిస్తుండటం గమనార్హం.

News May 30, 2024

2.30 నిమిషాల నిడివితో రాష్ట్ర గీతం: సీఎం

image

TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 చరణాలతో 2.30 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతాన్ని రూపొందించినట్లు చెప్పారు. అధికారిక చిహ్నం ఇంకా ఖరారు కాలేదని, తెలంగాణ తల్లి రూపంపైనా అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

News May 30, 2024

ప్రజ్వల్‌ను అరెస్ట్ చేయాలంటూ మహిళల భారీ ర్యాలీ

image

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలసంఖ్యలో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. కర్ణాటకలోని హాసన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కేసు వెలుగుచూసిన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ప్రజ్వల్ ఇవాళ అర్ధరాత్రి స్వదేశానికి రానున్నారు.

News May 30, 2024

ఆవిర్భావ వేడుకల ముఖద్వారంగా కాకతీయ తోరణం

image

తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కాకతీయ కళా తోరణాన్ని ముఖద్వారంగా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజముద్రలో రాచరిక ఆనవాళ్లుగా కాకతీయ తోరణం, చార్మినార్‌ ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News May 30, 2024

‘కల్కి’ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను ఓ లెవెల్‌లో నిర్వహిస్తూ హంగామా చేస్తోంది. ఇదే ఊపులో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అన్నీ కలిసొస్తే జూన్ 7న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News May 30, 2024

మంత్రుల పేషీలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు

image

AP: జూన్ 3న సచివాలయంలోని మంత్రుల పేషీలు, ఛాంబర్లను ఖాళీ చేయించి, స్వాధీనం చేసుకోవాలని అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి బయటికి వెళ్లకుండా చూడాలని సూచించింది. తమ అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తరలించొద్దని స్పష్టం చేసింది. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

News May 30, 2024

మీరు వ్యాసం రాయగలిగినా సరే దూరంగా ఉండండి: వాహనదారుడు

image

పుణే పోర్షె కేసు సంచలనమైన వేళ ఓ వ్యక్తి తనదైన శైలిలో వాహనదారులకు వార్నింగ్ ఇచ్చాడు. 300 పదాల వ్యాసం రాయగలిగినా సరే తన వాహనానికి తగిన దూరం పాటించాలంటూ ఓ నోట్ తన కారుకు అంటించాడు. పుణే పోర్షె కేసులో 300 పదాల వ్యాసం రాయాలని కోర్టు ఇటీవల నిందితుడిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే‌లో ఓ కారుపై దర్శనమిచ్చిన ఈ నోట్ నెట్టింట వైరలవుతోంది.

News May 30, 2024

TG రాజముద్ర మార్పుపై పునరాలోచన?

image

తెలంగాణ రాజముద్ర మార్పుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు ఓ వర్గం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొత్త చిహ్నానికి 200కు పైగా సూచనలు వచ్చాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఆవిష్కరణ వాయిదా పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరికాసేపట్లో స్పష్టత రానుంది.

News May 30, 2024

ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేట్.. రూ.2.08 లక్షలు ఫైన్

image

విమానాన్ని ఆలస్యంగా నడిపినందుకు ‘ఎయిర్ ఇండియా’కి రూ.2.08 లక్షల జరిమానా పడింది. బెంగళూరుకు చెందిన జితేందర్ కుమార్ అనే వ్యక్తి గతేడాది సెప్టెంబర్ 25న స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి బయల్దేరారు. అయితే, విమానం ఆలస్యంగా వెళ్లడంతో స్విట్జర్లాండ్ ఫ్లైట్ మిస్ అయ్యారు. ఆయన కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించగా.. 8 నెలల తర్వాత ఎయిర్ ఇండియాకు ఫైన్ విధిస్తూ తీర్పు వెలువడింది.