News August 12, 2024

15 ఏళ్ల దిగువకు గ్లోబల్ యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్

image

గ్లోబల్ యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ 15 ఏళ్ల కనిష్ఠానికి చేరిందని ILO తెలిపింది. ఆసియాలో ఈ ట్రెండ్ ఎక్కువని GET for Youth నివేదికలో పేర్కొంది. నిరుడు 15-24 ఏళ్ల వయస్కుల్లో 64.9 మిలియన్ల మంది నిరుద్యోగులేనని తెలిపింది. అరబ్ రాజ్యాలు, తూర్పు, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 13 శాతమని, చదవుకున్నోళ్లకు హై స్కిల్ జాబ్స్ లేవంది. తయారీ, సేవల రంగాల్లో ఉద్యోగాల కొరత వేధిస్తోందని తెలిపింది.

News August 12, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బొత్స

image

AP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. విశాఖ కలెక్టరేట్‌లో ఆయన నామపత్రాలు దాఖలు చేశారు. అటు టీడీపీ బరిలో ఉంటుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 838 ఓట్లలో తమకు 500 పైగా ఓట్లు ఉన్నాయని, గెలుపు తనదేనని బొత్స ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ లేకున్నా టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్యే అవుతుందని ఆయన విమర్శించారు.

News August 12, 2024

అలా జరగకపోతే కేసు సీబీఐకి అప్పగిస్తా: సీఎం మమత

image

కోల్‌కతాలో కలకలం రేపుతున్న వైద్యురాలి హత్యాచార ఘటన దర్యాప్తుపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాష్ట్ర పోలీసులు వచ్చే ఆదివారంలోపు కేసును పరిష్కరించకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

News August 12, 2024

ఘోరం: సర్జరీ చేసి టవల్ కడుపులో వదిలేశారు!

image

యూపీలోని అలీగఢ్‌లో శివ్ మహిమ ఆస్పత్రి వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఓ గర్భిణికి డెలివరీ చేసిన తర్వాత ఆమె కడుపులో టవల్ వదిలేసి కుట్లు వేసేశారు. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తన భార్య ఆ తర్వాత కూడా కడుపునొప్పితో బాధపడిందని బాధితురాలి భర్త తెలిపారు. వేరే ఆస్పత్రిలో చేర్పించగా టవల్ ఉన్నట్లు గుర్తించి బయటికి తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.

News August 12, 2024

వన్డేలకు లబుషేన్ రిటైర్మెంట్?

image

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ వన్డేల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో జరిగిన 2023 WC ఫైనల్‌లో తాను వినియోగించిన బ్యాట్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘ఎట్టకేలకు ప్రపంచ కప్ ఫైనల్ బ్యాట్‌ని విరమించుకునే సమయం వచ్చిందని అనుకోండి’ అని రాసుకొచ్చారు. అయితే అతడు కేవలం బ్యాటుకే గుడ్ బై చెబుతున్నారా? లేక తానే రిటైర్ అవుతున్నారా అనే సందేహం నెలకొంది. మార్నస్ ఆ ఫైనల్‌లో 58రన్స్‌ చేశారు.

News August 12, 2024

ఈనెల 14న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

image

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ ఈనెల 14న విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించనుండగా మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది.

News August 12, 2024

వేణు స్వామిపై కేసు పెడతాం: ఫిల్మ్ జర్నలిస్టులు

image

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరంటూ జ్యోతిషుడు వేణు స్వామి జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA), తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) నిర్ణయించాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కించపరుస్తూ ఆన్‌లైన్‌లో కామెంట్స్ చేసేవారికి తమ చర్యలు అడ్డుకట్ట వేస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

News August 12, 2024

ఆవలింత అంటుకుంటుందా.. కారణమేంటి?

image

ఎవరైనా పక్కన ఆవలిస్తే మనకూ వెంటనే ఆవలింత వచ్చేస్తుంటుంది. ఇది మనకు మాత్రమే కాక జంతు ప్రపంచంలోనూ సహజంగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక సమూహంగా ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా ఉన్న ధైర్యాన్ని వరస ఆవలింతలు కలిగిస్తాయని, పరిణామక్రమంలో మనిషికి ఈ అలవాటు వచ్చి ఉండొచ్చని పేర్కొంటున్నారు. పక్కవారిని అనుకరించేలా చేసే మిర్రర్ న్యూరాన్ల వల్ల కూడా ఇది జరుగుతుండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

News August 12, 2024

KCRకు ఉన్న ధైర్యం కాంగ్రెస్‌కు లేదు: హరీశ్‌రావు

image

TG: గతంలో KCR అసెంబ్లీ సాక్షిగా దివంగత CM YSR పథకాలను మెచ్చుకొని, కొనసాగించారని BRS MLA హరీశ్‌రావు అన్నారు. కానీ, అలా నిజాలు చెప్పే ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ‘BRS ప్రభుత్వం కోర్టు కేసులు, ఎలక్షన్ కోడ్ వల్ల అభ్యర్థులకు అపాయింట్‌మెంట్స్ ఇవ్వలేకపోయింది. ఆ ఉద్యోగాలు తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకుంటోంది. BRS పాత్రను ఒప్పుకునే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు’ అని హరీశ్ అన్నారు.

News August 12, 2024

రికవరీ బాటలో అదానీ స్టాక్స్.. లాభాల్లోకి మార్కెట్లు

image

ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టం నుంచి 200 పాయింట్ల లాభాల్లోకి చేరుకుంది. 79900 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి 24413 వద్ద చలిస్తోంది. అదానీ గ్రూప్ స్టాక్స్ రివకరీ అయ్యాయి. నష్టాలు 7 నుంచి 4 శాతానికి తగ్గాయి. స్టాక్ మార్కెట్లపై హిండెన్‌బర్గ్ ప్రభావం కనిపించలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిస్ట్ విజయ్ అన్నారు.