News June 2, 2024

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

image

TG: రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతీయ ప్రగతికి రాష్ట్రం చేసిన సహకారం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారు. ఈ రాష్ట్రానికి గొప్ప చరిత్ర, శక్తిమంతమైన సంస్కృతి ఆశీర్వాదం ఉన్నాయి. రాబోయే కాలంలో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

News June 2, 2024

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మరోవైపు కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి కేంద్రం నుంచి వెళ్లిపోవడం చర్చకు దారితీసింది.

News June 2, 2024

వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన USA

image

టీ20 WCలో ఆతిథ్య అమెరికా ఖాతా తెరిచింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 రన్స్ టార్గెట్‌ను ఆ జట్టు 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరోన్ జోన్స్ 94*, గౌస్ 65 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. USA జూన్ 6న పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

News June 2, 2024

తెలంగాణ ఆవిర్భావం.. అందరి విజయం: పవన్ కళ్యాణ్

image

TG: సకల జనుల విజయంతోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడే దశాబ్దకాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని Xలో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ పోరాటాలకు పురిటిగడ్డ. ఇక్కడ గాలిలో, నేలలో, నీటిలో, మాటలో, పాటలో సైతం పోరాట పటిమ కనిపిస్తుంది. అభివృద్ధి ఫలాలన్నీ ప్రజలందరికీ అందాలి. అప్పుడే అమరులకు నిజమైన నివాళి. జనసేన తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు.

News June 2, 2024

అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయనతో పాటు మంత్రులు, నేతలు స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. కాసేపట్లో సీఎం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

News June 2, 2024

ELECTION COUNTING: అరుణాచల్‌లో బీజేపీ హవా

image

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి అధికారం దిశగా బీజేపీ సాగుతోంది. 60 సీట్లకు గాను పోలింగుకు ముందే 10 స్థానాలు ఏకగ్రీవం చేసుకోగా, ఇవాళ ఓట్ల కౌంటింగులో 50 స్థానాలకుగాను 31 స్థానాల్లో లీడింగులో ఉంది. NPP 8, NCP 3, PPA 2, ఇండిపెండెంట్లు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిక్కింలో 32 స్థానాలకు గాను SKM ఏకంగా 29 స్థానాల్లో లీడింగులో ఉంది.

News June 2, 2024

నేను ఇజ్రాయెలీ బాంబుపై సంతకం చేయలేదు: క్రిస్ ఇవాన్స్

image

ఇజ్రాయెల్ దళాలకు సపోర్టుగా ఓ బాంబుపై తాను సంతకం చేసినట్లు వస్తున్న వార్తలను ‘కెప్టెన్ అమెరికా’ నటుడు క్రిస్ ఇవాన్స్ ఖండించారు. ‘వైరల్ అవుతున్న ఆ ఫొటో 2016 USO టూర్‌లో తీశారు. చాలా మంది యాక్టర్లు, అథ్లెట్లతో కలిసి అక్కడికి వెళ్లాను. నేను సైన్ చేసిన వస్తువు బాంబు, క్షిపణి, ఆయుధం కాదు. అదొక డమ్మీ ఆబ్జెక్ట్’ అని తెలిపారు. కొన్ని నెలలుగా హమాస్‌ మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

News June 2, 2024

AP, TGలో వడదెబ్బతో 11 మంది మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. నిన్న వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ఐదుగురు మరణించారు. TGలోని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. ఏపీలో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

News June 2, 2024

అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యం: గవర్నర్

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన ఆయన.. వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని ఆయన పిలుపునిచ్చారు. HYDలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.

News June 2, 2024

పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందాం: CM రేవంత్

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ. ఆ పిడికిలి విప్పిచూస్తే.. త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ద ఉత్సవాల వేళ “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని, విశ్వ వేదికపై సగర్వంగా నిలబడుతుందని’ అని సీఎం ట్వీట్ చేశారు.